22 May, 2026 | 1:35 AM

భానుడి భగభగ.. ప్రజలు విలవిల

22-05-2026 12:45 AM
  1. ఉదయం 10 గంటలకే నిర్మానుష్యం గా రోడ్లు
  2. షాప్ లు బంద్ బెంబేలెత్తుతున్న వీధి వ్యాపారులు 

ఖమ్మం టౌన్/ఖమ్మం, మే 21 (విజయ క్రాంతి):  సూర్యభగవానుడు నరసింహా అవతారమెత్తాడు.. ప్రజలపై సూర్యాగ్రరూపం చూపిస్తున్నాడు.. మునుపెన్నడూ లేని విధంగా భూమి పై ఆక్రోశంతో అగ్నిఘోలం  చూపిస్తున్నట్లు మంటలు మండిస్తున్నాడు.. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ ఏడాది బానుడు భగభగమండిపోతున్నాడు. గత నాలుగు రోజులుగా భానుడి ప్రతాపానికి  ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీంతో తెల్లవారుజామున నుంచి ఎండ తన ప్రభావం చూపిస్తోంది. మధ్యాహ్నం 12గంటల నుంచి అగ్ని గోళంను తలపిస్తోంది. 

రికార్డు స్థాయిలో ఎండలు..

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48డిగ్రీల ఉష్ణోగ్రతలతో బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గతేడాది 40డిగ్రీలతో ఆగిపోయిన ఎండలు, ఈ ఏడాది ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాయి. ఖమ్మం పట్టణం లో 44 డిగ్రీల నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది.

ఒక వైపు ఎండ.. మరో వైపు ఉక్కపోత..

ఒక వైపు ఎండ, మరో వైపు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం 7గంటల నుంచి రాత్రి 6గంటల వరకు ఎండు తీవ్రత ఎక్కువగా ఉండగా, 24గంటల పాటు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజంతా చెమటలతో అల్లాడిపోతున్నారు. ప్రజలు, చిరు వ్యాపారులు, ముఖ్యంగా డ్రైవర్లు బెంబెలెత్తు తున్నారు. ఎండు, ఉక్కపోతకు కూలర్లు, ఏసీలు పనిచేయడం లేదు. 

వణికిపోతున్న జనం..

ఎండ తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు.  ఉదయం 10 గంటలకు రోడ్లు కాళీ అవుతున్నవి. వీధి వ్యాపారాలు వారి వారి వ్యాపారాన్ని బంద్ చేసి, వారి వ్యాపార సామాగ్రికి జాబు కాగితాలతో కప్పి ఇళ్లకు వెళ్తున్నారు. రోడ్లన్నీ  10 గంటలకే ఖాళీ అవుతుండటముతో కొన్ని షాప్ ల వారు కూడా 11 గంటలకు షాప్ లను బంద్ చేసి ఇంటికి వెళ్తున్నారు. చిన్న పిల్లలు, పెద్ద వారు ఈ వేడి గాలులకు, ఊక్క పోతకి తట్టుకోలేక పోతున్నారు.

సాయంత్రం 7 గంటలకు కూడా వేడి  గాలులు తగ్గడం లేదు. ఇక బిల్డింగ్ కార్మికులు, రోజు వారి పనులు చేసికొనే వారి పరిస్థితి అత్యంత దారుణం. గతంలో కూడా మేము బిల్డింగ్ పనులు చేసాము, కానీ ఎన్నడూ ఇంత వేడి చూడలేదు అని అంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మాకు ఇంట్లో వుంటే పూట ఎలా గడుస్తుందని రోజు వారి పనులు చేయనుకోనే వారు బిల్డింగ్ కార్మికులు అంటున్నారు.

ఉదయం నుండి రాత్రి వరకు వుండి అమ్ముకొంటేనే మా ఇల్లు గడుస్తవి, ఈ ఎండల వలన 10 గంటలకే ఇళ్లకు వెళ్లి మళ్ళీ సాయంత్రం వస్తున్నాము, మా వ్యాపారాలు సగానికి సగం తగ్గావని, రెండు సార్లు ఇళ్లకు వెళ్ళటంతో ఖర్చులు కూడా పెరిగావని వీది వ్యాపారాలు చెబుతున్నారు.

ప్రభుత్వం హెచ్చరిక

ఎండల తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ప్రజలేవ్వరు బయటకు రావోద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, అవసరముంటేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు.   తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

ఊరి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. అయితే ఎండలు తగ్గాలని ప్రజలు దేవుడ్ని జనం ప్రార్థిస్తున్నారు.. మరీ రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత పెరుగుతుందా..,? తగ్గుతుందా..? వేచి చూడాల్సిందే..?