22 May, 2026 | 1:35 AM

600 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

22-05-2026 12:45 AM

నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 

ఎల్బీనగర్, మే 21 : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్వోటీ, హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నాడు. పెద్ద అంబర్ పేట శివారులో 600 కిలోల విత్తనాలు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీలోని నంద్యాల నుంచి హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ శివారులో నిల్వ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని నంద్యా ల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని వివిధ గ్రామాలకు  చలివెందుల రాజా రామ్ (42),  గోస స్వామి దాసు(48), అనుముల మల్లేశ్వరయ్య (28), కందాల చిన్న ఓబులేసు(45) వీరు నిషేధిత స్పూరియస్ బీటీ- 3 పేరుతో నకిలీ పత్తి విత్తనాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్వో టీ, హయత్ నగర్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 

నంద్యాల నుంచి  నిషేధిత బీటీ -3 పత్తి విత్తనాలను హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేటలోని ’పిస్తా హౌస్’ హోటల్ పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలంలో నిల్వ చేస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 600 కిలోల నిషేధిత బీటీ -3 పత్తి విత్తనాలు, రెండు వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని విచారించగా  తెలంగాణలో నకిలీ బీటీ -3 పత్తి విత్తనాలను అక్రమంగా సేకరించి, రవాణా చేసి, విక్రయిస్తున్నట్లు తెలిపారు.

దీంతో నలుగురిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న రామ్‌మోహన్ అలియాస్ మోహన్ రెడ్డి (40)ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.  మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి  పర్యవేక్షణలో ఎస్వోటీ డీసీపీ మనోహర్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఎల్బీనగర్ ఎస్వోటీ అదనపు డీసీపీ ఎండీ షాకిర్ హుస్సేన్, అబ్దుల్లాపూర్‌మెట్ మండల వ్యవసాయ అధికారి పల్లవి,  హయత్‌నగర్ పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు.