విద్యుత్ శాఖలో నకిలీలలు
- జెన్యూనిటీకి పంపడంతో ఫేక్ సర్టిఫికెట్ల గుట్టురట్టు
- నలుగురు 2020 బ్యాచ్ జేఎల్‌ఎంలు సస్పెన్షన్
- సహకరించిన సీనియర్ అసిస్టెంట్‌పై వేటు
సంగారెడ్డి, మే 21(విజయక్రాంతి): సంగారెడ్డి విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇదే శాఖలో టేకోలాక్ దోపిడీ వెలుగులోకి రాగా తాజాగా నకిలీ పట్టా సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందిన ఉదంతం బయటపడింది. నకిలీ పట్టాలని తెల్సినా సర్టిఫికెట్ పరిశీలన సమయంలో తాము చూసుకుంటామంటూ ఇద్దరు యూనియన్ నేతలు, మరో సబ్ ఇంజనీర్ నమ్మించారు. ఆలా నకిలీ సర్టిఫికెట్ ఉద్యోగులు ఆరేళ్లుగా ఉద్యోగం చేసేందుకు సహకరించారు.
వాళ్లకు ఈ ఆరేళ్లలో జేఎల్ ఎం నుంచి ఏఎల్‌ఎంగా పదోన్నతి లభించింది. అయితే ఇంత తతంగం నడుస్తున్నా సదరు ఉద్యోగులు నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందారని ఉన్నతాధికారులు గమనించకపోవడం గమనార్హం. టీజీఎస్పీడీసీల్ పరిధిలో జూనియర్ లైన్‌మెన్‌ల నియామకాలు 2020 లో జరిగాయి. ఆ నియామకాల్లో తమ విద్యార్హతను అందుకు సంబంధించిన పట్టాలను పొందుపరుస్తూ ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందులో రోస్టర్ ప్రకారం ఖాళీ ల ఆధారంగా సంగారెడ్డి సర్కిల్ లో 90 మంది జేఎల్‌ఎంలుగా నియామకమయ్యారు. సర్కిల్ కేంద్రంగా జరిగే నియామకాల్లో వారిని జహీరాబాద్‌కు కేటాయించారు. ఇక వాళ్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీఎస్పీడీసీఎల్‌లో జేఎల్‌ఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇలా జేఎల్‌ఎం నియామకాల్లో సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లకు కేటాయించిన జేఎల్‌ఎంలకు సంబంధించి విద్యార్హత విషయంలో నిర్ధారణ జరిగింది.
కానీ 90 మందిలో నలుగురు ఉద్యోగుల విద్యార్హతకు సంబంధించి ధ్రువపత్రాలు అసలా.. నకిలీయా అనే విషయంపై అధికారులు సంబంధిత కళాశాలలకు జెన్యూనిటీ కోసం పంపలేదు. దీంతో వారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో కొనసాగారు. 2020 లో జేఎల్‌ఎంలుగా నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన సదరు ఉద్యోగులకు ఆయా డివిజన్‌లలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నోతి లభించింది. ఆలా దర్జాగా 2024లో ఏఎల్‌ఎంలుగా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు సదరు ఉద్యో గులకు సంస్థ నుంచి ఒక కోటి 20 లక్షల జీత భత్యాలు చెల్లించినట్టు సమాచారం.
అయితే సంగారెడ్డి విద్యుత్ సర్కిల్ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగిగా నియామకమైన సదరు అధికారి జూనియర్ అసి స్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా ఇక్కడే కొనసాగాడు. 20 ఏళ్లుగా ఒకే సీటుపై ఉండటానికి యూనియన్ నేతల సహకారం కూడా ఉండటంతో ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని కుంభకో ణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
చక్రం తిప్పిన సీనియర్ అసిస్టెంట్
సదరు ఉద్యోగుల సర్టిఫికెట్ జెన్యూనిటీ పంపలేదన్న అనుమానం రాకుండా సర్కిల్ ఏ డీఏంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ దరఖాస్తు తీసుకున్నట్టు, పంపినట్టు ఇన్వార్డ్ ఆ తర్వాత అవుట్ వార్డ్ చేయించి దరఖాస్తు తనవద్దే ఉంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐతే దొంగ సర్టిఫికెట్ల విషయాన్ని దాచేందుకు దాదాపుగా ఆ నలుగురి నుంచి సదరు అధికారి అక్షరాలా రూ.పది లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. అది తన కుటుంబీకుల అకౌంట్లకు వేయించుకున్నారనే ప్రచారం సాగుతోంది.
ఆర్టీజీయన్లను తప్పించారు.. నలుగురిని కాపాడారు
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అందరి ఉద్యోగుల విద్యార్హత నిజామా కదా అన్న విష యం నిర్ధారణ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సర్కిల్ పరిధిలోని అందరు ఆర్టీజీయన్లు కొత్తగా నియామకమైన ఏ ఉద్యోగికైనా జెన్యూనిటీ కోసం సదరు కళాశాలకు పంపుతారు. అలా ప్రస్తుతం నకిలీ అని తేలిన ఈ న లుగురితో పాటు మరో ఐదుగురు ఆర్టీసియన్ల సర్టిఫికెట్లను జెన్యూనిటీకి పంపారు. అం దు లో ఆ నలుగురు నకిలీ సర్టిఫికెట్లు నకిలీ అని తేలడంతో వారిని విధుల నుంచి తప్పించారు.






