రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్న కేంద్రం
29-03-2025
జనగామ, మార్చి 28(విజయక్రాంతి): ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పంజాబ్ ప్రభుత్వం, ప్రధాని మోడీ చేస్తున్న దాడులు, నిర్బంధాలను వెంటనే ఆపాలని తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై చేసిన దాడులకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలో చౌరస్తా వద్ద సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గతంలో దేశ రైతాంగానికి ఇచ్చిన రాత పూర్వక హామీలను అమలు చేయాలని రెండో దశ ఉద్యమం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులను సరిహద్దుల్లో నిలువరించి ఉగ్రవాదులపై ప్రయోగించే దాడులను చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా ఆందోళనకు అవకాశం లేకుండా భాష్ప వాయువులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎఫ్ జిల్లా బాధ్యులు కుర్ర రవీందర్ గౌడ్ , తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్ , పట్టణ అధ్యక్షుడు ఉర్సుల కుమార్, సీనియర్ నాయకులు మండ్రా బండయ్య, కర్రె సత్యనారాయణ, కర్రె సిద్దిమల్లయ్య, నీలం బాలరాజు, సులోచన, సోని పాల్గొన్నారు.