22 May, 2026 | 1:33 AM

‘సాకేత్ ఇంజినీర్స్’తో కుమ్మక్కు!

22-05-2026 12:56 AM
  1. డాక్యుమెంటేషన్‌లో సహకరించిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు
  2. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొనుగోలుదారుల విల్లాలు, ప్లాట్లపై రూ.80 కోట్ల్ల రుణం పొందిన సాకేత్ సంస్థ
  3. డిబెంచర్ ట్రస్ట్రీ విస్ట్రా పాత్ర పైనా అనుమానాలు 
  4. ఆర్బీ, సెబీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న బాధితులు

మేడ్చల్, మే 21 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గౌడవెల్లి శివారులో కొనుగోలుదారుల విల్లాలు, ప్లాట్లు అక్రమంగా మార్టిగేజ్ చేసి మోసగించిన సాకేత్ ఇంజనీర్స్ సంస్థ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తు న్నాయి. సాకేత్ ఇంజినీర్స్‌తో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కుమ్మక్కైనట్లు తెలుస్తోంది.

సాకేత్ ఇంజినీర్స్ రుణం పొందడానికి అవసరమైన డాక్యుమెంట్‌ల తయారీలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అన్ని విధాలా సహకరించినట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. భూసత్వ ఫేజ్-1, ఎక్స్టెన్షన్ విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ప్రణామం అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు ఇదివరకే రిజిస్ట్రేషన్ అయినప్పటికీ తనఖా పత్రాలు రిజిస్ట్రేషన్ కావడం ఆ శాఖ అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 

ఈసీని పరిశీలించకుండానే.. తనఖా పత్రాల రిజిస్ట్రేషన్

తనఖా పత్రం రిజిస్ట్రేషన్ చేసేముందు ఈసీని పరిశీలించాలి. కానీ అధికారులు అలా చేయలేదు. తనఖా దస్తావేజు టైటిల్ డీడ్, ఇత ర డాక్యుమెంట్‌లను సైతం సరిగా పరిశీలించలేదు. తనఖా పెట్టే వ్యక్తి ఆస్తి తనదేనని స్పష్ట మైన ఆధారాలు చూపించకపోతే తనఖాను అంగీకరించకూడదు. ఈ విషయంలో 2009 డీజీపీఏను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాకేత్ ఇంజినీర్స్ సంస్థ తన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు విక్రయించిన తర్వాత యజమానులకు తెలియకుండా తనఖా పెట్టి రూ.80 కోట్ల రుణం పొందింది.

మీ సేవలో కనిపించని మార్టిగేజ్ రిలీజ్ డీడీ

సాకేత్ ఇంజినీర్స్ సంస్థ నిర్మించిన విల్లా లు, ప్రణామంలో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  మీ సేవ కేంద్రంలో ఈసీ కోసం దరఖాస్తు చేస్తే సరైన సమాచారం రాకపోవడం.. వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్ వస్తుండగా, మార్టిగేజ్ రిలీ జ్  డీడ్ కనిపించడం లేదు. అదే ఆన్‌లైన్‌లో చూస్తే కనిపిస్తోంది. ఈసీలో మార్టిగేజ్ రిలీజ్ డీడ్ కనిపించకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. 

డాక్యుమెంట్‌లు సరిగా లేకున్నా మార్టిగేజ్

ఈ మోసం వెనుక డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ (ఇండియా) లిమిటెడ్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాకేత్ ఇంజినీ ర్స్ డిబెంచర్లు ఇష్యూ చేసింది. విస్టా ఐటీసీఎల్ (ఇండియా) లిమిటెడ్ అన్ని డాక్యుమెంట్లు సరిచూసుకొని మార్టిగేజ్ చేయాలి. కానీ డాక్యు మెంటేషన్ సరిగా లేనప్పటికీ మార్టిగేజ్ డీడ్ చేసింది. సాకేత్ ఇంజినీర్స్‌కు రిజిస్ట్రేషన్ అధికారులు, విస్టా కంపెనీ పూర్తి సహకారం అం దించినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులనే కాకుండా డిబెంచర్ హోల్డర్లను కూడా మోసం చేశారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ఈ విషయమై బాధితులు ఆర్బీ, సెబీకి ఫిర్యా దు చేయడానికి సిద్ధమవుతున్నారు. 

బాధితుల్లో భూములిచ్చిన వారు..

సాకేత్ ఇంజినీర్స్ చేసిన మోసాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాకేత్ ఇం జినీర్స్ సంస్థ డైరెక్టర్ జి.రవికుమార్ ఇటీవల బాధితులకు లేఖ రాశారు. వారం రోజుల్లో క్లియర్ ఈసీలు ఇస్తామని  పేర్కొన్నారు. 

కొనసాగుతోన్న దర్యాప్తు

బాధితులు ఈనెల 3వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 5వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.