22 May, 2026 | 2:38 AM

ఆర్టీసీ జేఏసీ-యాజమాన్య చర్చలు సఫలం

22-05-2026 01:09 AM
  1. అలవెన్సులు, వేతన సవరణ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కీలక నిర్ణయాలు
  2.   11 శాతం ఫిట్‌మెంట్‌తో 2021 పీఆర్‌ఎసీ
  3. ఫ్రింజ్ బెనిఫిట్స్ 80 శాతానికి పెంచేందుకు అంగీకారం
  4. మరికొన్ని అంశాలపై త్వరలో మరో సమావేశం

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఆర్టీసీ) యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య గురువారం జరిగిన కీలక సమావేశం లో పలు అంశాలపై యాజమాన్యం సానుకూ ల నిర్ణయాలు తీసుకుంది. జేఏసీ ప్రతిపాదించిన వివిధ డిమాండ్లను అంగీకరించింది. ప్రధానంగా 2017 అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్‌ను 80 శాతానికి పెంచేందుకు అంగీకరిం చింది. అలాగే 2021 వేతన సవరణను 11 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేసి, జూలై 1 నుంచి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.

బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని, వారి సర్వీస్ సీనియారిటీ కొనసాగించాలని నిర్ణయం జరిగింది. ఇకనుంచి జరిగే నియామకాలను రెగ్యు లర్ ప్రాతిపదికన చేపట్టాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ నెలా ఖరులోపు పోస్టింగ్‌లు ఇవ్వాలని  నిర్ణయించారు.

రిటైర్డ్ ఉద్యోగుల 2017 వేతన సవరణ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం నుంచి రుణం పొందే దిశగా చర్యలు చేపట్టనున్నారు. హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పరిశీలించి, అర్హులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది. 

రిటైర్డ్ ఉద్యోగుల వైద్య ఖర్చుల పరిమితి రూ.6 లక్షలకు పెంపు

రిటైర్డ్ ఉద్యోగుల వైద్య చికిత్సల ఖర్చుల పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. గతంలో మాదిరిగా రెండు నెలలకు సరిపడే మందులను ఒకేసారి అందజేయాలని కూడా నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిలో రోగులు, సహాయకుల కోసం రూ.40 లక్షల వ్యయంతో విశ్రాంతి గది, డైనింగ్ హాల్ నిర్మాణానికి యాజమాన్యం ఆమోదం తెలిపింది.

ఉద్యోగుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కల్పించే అంశంపై ఎండీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఉద్యోగ భద్రత అంశంపై ఈ సమావేశంలో చర్చ పూర్తి కాలేదని, తదుపరి సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించాలని కమిటీ నిర్ణయించింది. మిగతా అంశాలపై కూడా మరో సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఈడీలతో కూడిన కమిటీ వెల్లడిం చింది.   జేఏసీ చైర్మన్ ఈదు రు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో- కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి పాల్గొన్నారు.