నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు
- అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
- కన్నెత్తి చూడడని అధికారులు
సికింద్రాబాద్, మే21 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో అధికారుల అవినీతి, అక్రమాలతో పాటు అలసత్వం రాజ్యమేలుతోంది. పేదలు పైసా పైసా కూడపెట్టి ఇండ్లు నిర్మించుకుంటే, నిబంధనల పేరుతో కూల్చివేసే ఇంజనీరింగ్ అధికారులు బడా బాబుల ఇండ్లవైపు కన్నెత్తి చూడడం లేద ని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఇంజనీర్ల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులలో అధికారులు, అధికారం లో ఉన్న నాయకుల అండదండలతో భారీఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ కొరకు నిర్మాణాలు జరుగుతున్నా.. బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక మతాలబు ఏమిటోనని పలువురు పేర్కొంటున్నారు.
బోర్డు పరిధిలోని అన్ని వార్డుల్లో అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులున్నారని స్థానికులు ఆరోపిస్తున్నా రు. ముఖ్యంగా ఆరవ వార్డు భావన కాలనీ ఫేస్ వన్‌లో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనా బీజేపీ నాయకుడు ఇటీవల భవన నిర్మాణాలకు అనుమతులు ఇప్పించడంతో బాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మా ణం జరిగేలా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరవ వార్డులో పలు కాలనీల్లో సైతం అక్రమ నిర్మాణాదారులకు సహకరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
సదరు బీజేపీ నేత గతంలో పలు కాలనీల్లో నల్ల కనెక్షన్లు ఇప్పించడంలో భారీగా డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతు న్నాయని స్థానిక ప్రజలు నుంచి ఫిర్యాదులు అందినా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనలు తుంగలోకి తొక్కి ఆకాశమే హద్దుగా జి ప్లస్ త్రీ, ఫోర్, జి ప్లస్ ఫైవ్ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెట్టడం వెనక బలమైన ఓ బిజెపి నేత కారణం దాగి ఉందని దీని వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై కంటోన్మెంట్‌బోర్డు సీఈఓ దృష్టి సారించి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






