‘ధరణి’ తెచ్చిన తిప్పలు తప్పిస్తాం..
- ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తాం..
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
- నాడు దొరల గడీల్లో బందీ అయిన భూ రికార్డులు.. నేడు పేదల చేతుల్లోకి పట్టాలు
- రాష్ట్రాన్ని రూ.8.18 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా..
- సంక్షేమానికి వెనకడుగు వేయం
- ఎన్నికల నాటి ‘బొమ్మల ఇళ్ల’ నాటకాలకు చెక్.. రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు
- సత్తుపల్లి ప్రజా దర్బార్లో గత పాలకుల దగాపై రెవెన్యూ మంత్రి పొంగులేటి నిప్పులు
సత్తుపల్లి, మే 21(విజయక్రాంతి): ‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు గడీల పెత్తనంలో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం‘ అని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్ లో స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన ’ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక - ప్రజా దర్బార్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి.. వందలాదిగా తరలివచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించి, గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేడు అకౌంట్లలోకి కాసులు
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అడ్డగోలుగా రూ.8 లక్షల 18 వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ‘అప్పులు ఉన్నాయని నెపంతో మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఉన్న వనరులతోనే పేదవాడికి భద్రత, భరోసా కల్పిస్తున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్లు పూర్తి కాగా, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధమవుతాయి.
వచ్చే జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభి స్తున్నాం‘ అని ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే 72,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో కొత్త కొలువుల ప్రకటన రాబోతుందని తెలిపారు.
కాలపరిమితి లోగా భూముల కొలతలు.. పహానీల్లో పేర్లు!
సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఒకట్రెండు రోజుల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు.
అటవీ అడ్డంకులు వద్దు.. రైతులకు పూర్తి రక్షణ
రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10-12 గ్రామాల్లో నెలకొన్న అటవీ-రెవెన్యూ భూముల వివాదాలపై మంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలి. మిగిలిన రెవెన్యూ భూమిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే‘ అని మంత్రి భరోసా ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు సాగు కోసం బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎక్కడా అభ్యంతరాలు పెట్టవద్దని, జిల్లా అదనపు కలెక్టర్, ఉప కలెక్టర్లు ఈ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.






