22 May, 2026 | 2:38 AM

అబద్ధాల బీఆర్‌ఎస్

22-05-2026 01:38 AM
  1. రైతులు మరణించారన్నది ముమ్మాటికీ అవాస్తవం 
  2. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రికార్డ్ 
  3. కేటీఆర్ వ్యాఖ్యలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకే 
  4.   8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు 
  5. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, మే 21(విజయక్రాంతి): అర్ధసత్యాలు, అబద్ధాల ప్రచారానికి బీఆర్‌ఎస్ పార్టీ పెట్టింది పేరని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రైతు ల సంక్షేమంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విడుదల చేసిన లేఖపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి  ఘాటుగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పది మంది రైతులు మృత్యువాత పడ్డారం టూ కేటీఆర్ పేర్కొన్న విషయాల్లో అణువంతైనా నిజం లేదని ఆయన కొట్టిపారేశారు.

రాజకీయాల కోసం బురద చల్లే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా చనిపోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చి.. ఇప్పుడు రైతు సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడితోపాటు కొను గోళ్ల ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు నమోదు చేసుకొందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2025--26 రబీ సీజన్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, 46.21లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.7,841 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.

మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో 6.3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరిలించేందుకు వీలుగా 13,000 వాహనాలను వినియోగిస్తునట్టు అయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుంటే దానిని వక్రీకరించి అసత్యపు ప్రచారానికి పూనుకోవడం వారి డొల్ల తనానికి అద్దం పడుతోందన్నారు.

అదే బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు, మిల్లర్లతో లాలూచీ చెల్లింపులలో ఆలస్యం జరిగిందని మంత్రి విమర్శించారు. వాస్తవాలు ఇలా ఉంటే గురివింద గింజ నలుపు ఎరుగదన్న మాదిరిగా కేటీఆర్ లేఖ ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ధాన్యం దిగుబడి, కొనుగోలులో సరికొత్త రికార్డ్ నమోదు చేసుకోవడంతో పాటు పారదర్శకంగా జరుగుతుంటే కేటీఆర్ తట్టుకోలేక రైతులపై మరోసారి అక్కసు వెళ్లగక్కారన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అప్పుల చేసి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టులో పెట్టింది చాలక రైతు సంక్షేమం పేరుతో మొసలికన్నీరు కారుస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుని వేల కోట్లు దోచుకున్న అంశం దేశవ్యాప్తంగా తెలుసని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పరిస్థితి ‘మీ అవినీతి పాలనకు అద్దం పడుతోంది’ అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రతీ ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతున్నామన్నారు. నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.