ఎంఎంటీఎస్ కీలకం
- మెట్రో టైమింగ్స్, సౌకర్యాలను మెరుగుపరచండి
- కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ఎంఎంటీఎస్ టైమింగ్స్ రెగ్యులరైజేషన్, సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో గురువారం రైల్వే మంత్రితో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్‌పై చర్చించారు.
హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంఎంటీఎస్ కీలక రవాణా సౌకర్యంగా మారిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని విన్నవించారు. అందుకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. అదే విధం గా రాష్ట్రంలోని 42 ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ తదితర అంశాలపై చర్చలు జరిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని, రాను న్న రోజుల్లోనూ రైల్వే నెట్‌వర్క్ మరింత పెంచడం, మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వేమంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. వాణిజ్య, గనుల రంగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.






