19 March, 2026 | 12:00 AM

చిన్నకాపర్తి సౌమ్య విద్యామందిర్ లో ముందస్తు ఉగాది వేడుకలు

18-03-2026 08:58 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో బుధవారం ముందస్తుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని, భక్షాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొని పచ్చడిని సేవించి, భక్షాలను ఆస్వాదించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బొడిగె విజయకుమార్ మాట్లాడుతూ... జీవితంలో కష్టసుఖాలు, లాభనష్టాలు సర్వసాధారణమని, అన్నింటినీ సమంగా స్వీకరిస్తూ ప్రతిరోజును ఆనందంగా గడపాలని, ఉగాది స్పూర్తి, కొత్త లక్ష్యాలతో ముందడుగు వేయాలన్నారు. విద్యార్థులకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ప్రాశస్త్యం, పంచాంగం, ఉగాది పచ్చడి విశిష్టత, సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు అన్నిరంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పండుగలు మన వారసత్వ సంపదగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వసంత ఋతువులో ఉగాది పర్వదినం రోజున చెట్లు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే ఉత్సాహం విద్యార్థుల జీవితాల్లో నిండి ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొడిగె రాణి, రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, ఈరమల్ల లూసిక, మునుకుంట్ల స్వాతి, బెల్లంకొండ రాజేశ్వరి, సూరోజు హర్షిణి, విద్యార్థులు బోగ ఆనంది, మెట్టు వర్షిత, ఆకుల సుప్రీత్, కొత్త ప్రణీత్, మెట్టు శివతేజ, కార్తీక్, దివ్యశ్రీ, కావ్య, ప్రణవి, రిచిత, శ్రీకృష్ణప్రియ, పవిత్ర, జ్యోతి, ఇందు, రిషా, వర్షిత, సహస్ర, శృతి, హన్సిక, ప్రతీక్, అలీన తదితరులు పాల్గొన్నారు.