వాంగ్‌చుక్‌ను కాపాడండి
- ప్రభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
- ప్రతిపౌరుడి ప్రాణం అమూల్యమైనదే
- అన్ని ప్రయత్నాలు చేయాలన్న ధర్మాసనం
- 9 కేజీలు తగ్గారన్న వైద్యులు
- దీక్ష విరమించబోనన్న వాంగ్‌చుక్
న్యూఢిల్లీ, జూలై 16: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. మరోవైపు ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. వెంటనే ఆయనను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవా లని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రతిపౌరుడి ప్రాణం అమూల్యమైనదేనని, అలాంటి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేసింది.
అలాగే తన ఆమరణ దీక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ విరమించబోనని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. మరో రెండు రోజులు దీక్ష కొనసాగిస్తే వాంగ్‌చుక్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చని గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషనర్ ఆరోపించడంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాంగ్‌చుక్ ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.
ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 65 కేజీలుగా ఉన్న 59 ఏళ్ల వాంగ్‌చుక్ 19 రోజుల్లో 9 కేజీలు తగ్గారన్నారు. బీపీ, షుగర్‌లు బాగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. కాగా వాంగ్‌చుక్ తాను అంత ప్రమాదకర స్థితికి దిగజారలేదన్నారు. 20న జరిగే చలో సంసద్ పేరిట పార్లమెంట్ వరకు నిర్వహించే శాంతియుత మార్చ్‌లో అందరూ భాగం కావాలని మద్దతుదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమరణ దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు. దీక్ష విరమిస్తే ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండదని తెలిపారు. రాజకీయ నాయకులు, మద్దతుదారుల విజ్ఞప్తులు, చట్టపరమైన జోక్యాలు వచ్చినప్పటికీ ఆయన దీక్ష విరమించడానికి నిరాకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే.. ఈ నిరసన లక్ష్యం దెబ్బ తింటుందని, అలాగే ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు.






