17 July, 2026 | 2:04 AM

‘యూత్ డిక్లరేషన్’ ఓ వంచన

17-07-2026 02:04 AM
  1. కాంగ్రెస్ వైఫల్యాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుస సభలు
  2.    18న సరూర్‌నగర్‌లో భారీ యువజన సదస్సు   
  3. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి) : ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం ప్రజల నమ్మ కాన్ని పూర్తిగా కోల్పోయిందని,  పదవీకాలం సగం పూర్తికాకముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని కేటీ ఆర్ పేర్కొన్నారు.

ఎన్నికల హామీల అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తుందన్నారు. వరంగల్ సభ అనంతరం, ఈనెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో ‘యువ సంగ్రామ’ సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు కేటీ ఆర్ ప్రకటించారు. గురువారం ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో పార్టీ నేతలతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సరూర్‌నగర్ యువజన సభ ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించారు. యువజన సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందని, అందుకే సమాజంలోని ప్రతి వర్గం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కాంలు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు, అనుసరిస్తున్న విధానాలు, పాలన ప్రజాకంటకంగా మారాయన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ కాలం ముగిసిపోతుందనే విషయం స్పష్టమవుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. 

రైతులు సాగునీటి కోసం అడుగుతుంటే, వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ‘రక్తం పారిస్తా‘ అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో, కరువు అంచున ఉండగా.. ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయని పేర్కొన్నా రు. చివరకు రైతులు కూడా ‘మా రక్తాన్ని తీసుకోండి.. కానీ మా పొలాలకు నీళ్లు ఇవ్వండి‘ అని డిమాండ్ చేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభు త్వం తీసుకొచ్చిందని విమర్శించారు.