17 July, 2026 | 2:14 AM

విద్యార్థులపై ట్రంప్ కత్తి!

17-07-2026 01:59 AM

స్టూడెంట్ వీసాలకు నాలుగేళ్లే పరిమితి 

డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్‌కు ముగింపు 

కొత్త రూల్ అమలైతే అమెరికాలోని 3.31 లక్షల మంది భారత విద్యార్థులపై తీవ్రప్రభావం

వాషింగ్టన్, జూలై 16: అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కత్తి వేలాడుతోంది. కొత్త వీసా నిబంధన కింద విదేశీ విద్యార్థుల వీసాల (ఎఫ్1) కాలపరిమితిని అమె రికా నాలుగేళ్లకు పరిమితం చేయనుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా కోసం స్టేటస్ వ్యవధి స్థానంలో స్థిర వీసా గడువులను ప్రవేశపెట్టే నిబంధనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఖరారు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ముగింపు పలికింది.

దీంతో దాదాపు 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులపై తీవ్ర పభావం పడనుంది. అలాగే అమెరికాలో చదువుతున్న దాదాపు 12 లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ మార్పు వల్ల, అమెరికాలో దీర్ఘకాలిక కోర్సులు చేస్తున్న చాలా మంది భారత దేశంతోపాటు అంతర్జాతీయ విద్యార్థులు తమ గడువును పొడిగించుకునే ప్రమాదం రావొచ్చు. అంతేకాకుండా ఆలస్యం జరిగితే చట్టవిరుద్ధంగా దేశంలో ఉండిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఎందుకంటే, దీర్ఘకాలంగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని తొలగించి, దాని స్థానంలో నిర్దిష్ట కాలపరిమితితో కూడిన నివాసాన్ని ప్రవేశపెట్టే నిబంధనను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఖరారు చేసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. గురువారం విడుదల చేసిన కొత్త నిబంధన కింద, ఎఫ్-1 వీసాల(డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్)పై ఉన్న విద్యార్థులు సాధారణంగా నాలుగు సంవత్సరాల వరకు అమెరికాలో ఉండటానికి అనుమతి ఉంటుంది.

తమ చదువులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అవసరమైన వారు, తమకు అనుమతించబడిన గడువు ముగియక ముందే డీహెచ్‌ఎస్ నుంచి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన, జే1 ఎక్స్ఛేంజ్ విజిటర్స్, విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే ఐ వీసాల కోసం నిర్ణీత కాలపరిమితిని కూడా ప్రవేశపెడుతుంది.

ఈ చర్య అమలులోకి రాకముందు ఇప్పుడు కాంగ్రెస్ సమీక్షకు లోబడి ఉంటుంది. వీసా వ్యవస్థపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, జాతీయ భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడమే ఈ మార్పుల లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. తాజా విధానం అమెరికాలో చదువుతున్న దాదాపు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తోంది. 

3.31 లక్షల మంది భారత్ విద్యార్థులపై.. 

2023--24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో 3,31,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు చేరారు. వీరు దేశంలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 30 శాతంగా ఉన్నారు. వీరిలో చాలా మంది నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులను అభ్యసిస్తున్నారు. డీహెచ్‌ఎస్ ఈ నియమావళిని ఖరారు చేసినప్పటికీ, ఇది తక్షణమే అమలులోకి రాలేదు. అప్పటి వరకు ‘హోదా కాలపరిమితి’అమలులో ఉంటుంది.