నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
తండ్రి, కొడుకులపై కేసు నమోదు
ఆదిలాబాద్, జూలై 16 : నకిలీ పత్రాలు సృష్టించి స్థలం కబ్జాకు పాల్పడిన తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ బి సునీల్ కుమార్ తెలిపారు. గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణం లోని శాంతినగర్ బొక్కల్ గూడలోని ప్లాట్ నెంబర్ 4(స్థలాన్ని)ను సుష్మ బేల 1979లో గాదె నారాయణ వద్ద కొనుగోలు చేసింది. ఈ స్థలానికి మున్సిపాలిటీ నుంచిప్రొసీడింగ్స్, మ్యుటేషన్, డోర్ నెంబర్ తీసుకొని 2016లో రంగినేని సూర్య ప్రకాష్ కు మూడు సంవత్సరాల వ్యవధికి లీజుకు అప్పజెప్పింది.
2019లో లీజు పూర్తయిన తర్వాత తిరిగి స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. ఈ ఒప్పందం మేరకు మున్సిపాలిటీ అనుమతితో తాత్కాలిక నివాసాన్ని మాత్రమే ఏర్పర్చాల్సి ఉంటుంది. కానీ సూర్య ప్రకాష్ ఎలాంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా ఇల్లును నిర్మించి, ఆ స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించాలనే దురుద్దేశంతో 1983 నాటి మున్సిపల్ చైర్మన్ లక్ష్మణరావు పేరుపై, మున్సిపాలిటీ కౌన్సిల్ జారీ చేసినట్లుగా, చైర్మన్, కౌన్సిలర్ల నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులతో నకిలీ ప్రొసీడింగ్ పత్రాలను సృష్టించి, దానికి నకిలీ పట్టా సర్టిఫికెట్ ను సృష్టించారు.
దీనికి 2009లో నకిలీ మున్సిపాలిటీ పర్మిషన్ పత్రాలను సృష్టించి, ఈ పట్టా సర్టిఫికెట్ సహాయంతో రంగనేని సూర్యప్రకాష్ పేరుపై ఉన్న భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా రంగనేని శ్రీనివాస్ పేరుపై 2023లో మార్చుకున్నారు. అంతే కాకుండా ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి ఎస్బిఐ సిసిఐ బ్రాంచ్ బ్యాంక్ ద్వారా సోలార్ బిజినెస్ చేస్తామని రూ. 49 లక్షల రుణం కూడా తీసుకున్నారు. సక్రమంగా కిస్తీలు చెల్లించని పక్షంలో ఎస్బిఐ బ్యాంకు సైతం వారం రోజుల కిందట పేపర్ లో ఎన్ పీ ఏ చేస్తామని ప్రకటన ఇవ్వడంతో అసలు విషయం భయటకు వచ్చింది.
బాధితులు జిల్లా ఎస్పీ అఖిల్ మహోజన్ ని సంప్రదించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ బి సునీల్ కుమార్ విచారణ జరిపి నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులలో గురు వారం కొడుకు శ్రీనివాస్ ను అరెస్టు చేశామని, తండ్రి సూర్యప్రకాష్ పరారీలో ఉన్నాడన్నారు. నకిలీ పత్రాలను సృష్టించడంలో సహాయపడ్డ నిందితులపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.






