17 July, 2026 | 1:39 AM

యుద్ధం ఉధృతం

17-07-2026 01:37 AM
  1. ఇరాన్‌లో అమెరికా భీకర దాడులు
  2. హోర్ముజ్ జలసంధిలో టెహ్రాన్ నౌకపై దాడి
  3. బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి,సెమ్నాన్ ప్రావిన్స్ కేంద్రాలపై గురి
  4. టెహ్రాన్ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడి
  5. ప్రతీకారంగా జోర్డాన్, కువైట్‌పై టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం 
  6. అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేయండి: ఇరాన్ మాజీ మంత్రి
  7. ట్రంప్‌ను అంతం చేస్తామని టెహ్రాన్‌లో భారీ హోర్డింగ్

దుబాయ్, జూలై 16: పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతం అవుతోంది. గురువారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌పై భీక దాడులు చేసింది. టెహ్రాన్ వ్యూహాత్మక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకపై దాడి చేసింది. టెహ్రాన్ ఉత్తరాన ఉన్న లక్ష్యాలపై కూడా అమెరికా సైన్యం వైమానికి క్షిపణులను వేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కేంద్రంపై, అంతరిక్ష కేంద్రంగా ఉన్న సెమ్నాన్ ప్రావిన్స్‌పై పెంటగాన్ గురిపెట్టింది.

అహ్వాజ్‌లోని ఇరాన్ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడి చేసింది. ప్రతీకారంగా గురువారం తెల్లవారుజామున ఇరాన్ అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌పై  క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఎనిమిది క్షిపణులను జోర్డాన్ అడ్డుకుంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను అమలు చేస్తే.. తమ సాయుధ దళాల ఉక్కు పిడిగుద్దులతో ఆ దేశ మౌలిక సదుపాయాలను నుజ్జునుజ్జు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఇంకోపక్క ట్రంప్‌ను అంతం చేస్తామని ఇరాన్‌లో ఓ భారీ హోర్డింగ్‌పై ప్రదర్శించారు. 100 మంది అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేయాలని ఇరాన్ మాజీ మంత్రి మనుచెహర్ మొత్తకి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించాయి. హోర్ముజ్ జలసంధిపై నౌకాయాన దిగ్బంధనాన్ని మూడు రోజుల క్రితమే అమెరికా తిరిగి విధించింది. దీంతో అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ దాడులు మళ్లీ ప్రారంభించాయి.

గురువారం తెల్లవారుజామున టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. చాబహార్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం, సిరిక్, కొనరాక్, రాస్క్, ఖొండాబ్, ఖొర్రమాబాద్, సెమ్నాన్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి, అంతరిక్ష కార్యక్రమానికి నిలయమైన సెమ్నాన్ ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసిందని తెలిపింది. 

తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాలపై తొలిసారి దాడులు జరిగాయి. ఇది అమెరికన్ల లక్ష్యాలు విస్తరిస్తున్నాయని సూచిస్తోంది. గురువారం ఉదయం హమెదాన్, హోర్మోజ్గాన్, ఖుజెస్తాన్, లోరెస్తాన్, మార్కాజీ, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల చుట్టూ దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా, పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్ అయిన ఖర్గ్ ద్వీపం వైపు ప్రయాణిస్తున్న కురసావో జెండా కలిగిన ‘బెల్మా’ అనే చమురు ట్యాంకర్‌పై కాల్పులు చేశామని అమెరికా సైన్యం తెలిపింది.

ఆ నౌక ‘అనేక హెచ్చరికలను విస్మరించిన’ తర్వాత, దాని పొగగొట్టంలోకి క్షిపణిని ప్రయోగించి, ఆ వాణిజ్య నౌకను నిలిపివేశామని పేర్కొంది. ఇరాన్‌లోని అహ్వాజ్‌లో ఉన్న షాహిద్ బాఘేయి ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణులు దాడి చేశాయని ఇరాన్ పేర్కొంది. ఫలితంగా రోగులను అత్యవసరంగా తరలించామని తెలిపింది. 24 గంటల్లో ఇరాన్‌పై అమెరికా రెండు భారీ దాడులను చేసింది.

దీంతో ప్రతీకారంతో కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్‌లో అమెరికా రాడార్ వ్యవస్థలు, పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, ఇంధన నిల్వ కేంద్రాలను ఐఆర్‌జీసీ లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌పై డ్రోన్‌దాడులు చేసి, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా బలగాలు ఉన్న బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌పై గురువారం ఉదయం క్షిపణి, డ్రోన్ దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందని ఆయా దేశాల అధికారులు తెలిపారు.

తాము ఎనిమిది క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. గురువారం మధ్యాహ్నం తమపై కొత్తగా కాల్పులు జరిగినట్లు కువైట్ తెలిపింది. ఇదిలా ఉండగా, ఇరాక్‌లోని పాక్షిక స్వయంప్రతిపత్తి గల ఉత్తర కుర్దిష్ ప్రాంతంలోని ఇర్బిల్ నగరంపై రాత్రిపూట జరిగిన డ్రోన్ దాడిని ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీ ఖండించారు. ఇరాన్ మద్దతు ఉన్న వాటితో సహా, ప్రభుత్వేతర సాయుధ గ్రూపులను నిరాయుధీకరణ చేయడానికి ఇరాక్ కృషి చేస్తుందని ఆయన అమెరికా పర్యటనలో చెప్పిన సమయంలో ఈ డ్రోన్ దాడి జరిగింది.

దీనిని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల అమెరికా తాజా దాడుల్లో ఇప్పటికే 35 మందికి పైగా మరణించారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా అమెరికా, ఇరాన్ మధ్య రోజుల తరబడి జరుగుతున్న పరస్పర దాడులు, హోర్ముజ్ జలసంధికి కొత్తగా పొంచి ఉన్న ముప్పులు -ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన మధ్యంతర ఒప్పందాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఇవి ఈ ప్రాంతాన్ని తిరిగి పూర్తిస్థాయి యుద్ధంలోకి నెట్టే అవకాశం ఉంది. 

100 మంది అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేయాలి

100 మంది అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేయాలని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మనుచెహర్ మొత్తకి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఆక్రమించి, బంధించిన సైనికుల్ని ఇరాన్ తీసుకురావాలని సైన్యానికి సూచించారు.

ఇందుకోసం భూతల దాడులు చేయాలన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీసుకోవాలన్నారు. అమెరికాతో అవగాహన ఒప్పందం ఒక మోసపూ రిత ప్రణాళిక కుట్ర అని అభివర్ణించారు. ఇరాన్‌పై దాడి చేసినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ట్రంప్‌ను అంతం చేస్తాం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్టున్న చిత్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఎంఘిలాబ్ స్క్వేర్ ప్రాంతంలోని హోర్డింగ్‌పై ప్రదర్శించారు. దానిపై ట్రంప్‌ను అంతం చేస్తామన్న హెచ్చరికను ఇంగ్లిష్, పర్షియన్ భాషల్లో పేర్కొన్నారు. మినాబ్‌కు చెందిన చిన్నారుల స్మృత్యర్థం అని తెలిపారు. 

ఉక్కు పిడిగుద్దులతో నుజ్జునుజ్జు చేస్తాం: ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను అమలు చేస్తే.. దాని మిత్రదేశాల్లోని మౌలిక సదుపాయాలపై ఇరాన్ విస్తృత దాడులు చేస్తుందని టెహ్రాన్ సైనిక ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి కల్నల్ ఇబ్రహీం జొల్ఫఘరి హెచ్చరించారు.

‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ శక్తివంతమైన సాయుధ దళాల ఉక్కు పిడిగుద్దుల కింద ఈ ప్రాంతంలోని మీ స్థావరాలన్నీ నుజ్జునుజ్జు అవుతాయి’ అని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ, ఏ విధంగానూ, ఒక విదేశీ, ప్రాంతేతర దేశంగా ఉన్న అమెరికాను హోర్ముజ్‌లో జోక్యం చేసుకో నివ్వబోమని అన్నారు.