17 July, 2026 | 3:06 AM

ఇంద్రవెల్లిలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం

17-07-2026 02:50 AM

మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు

ఉట్నూర్, జూలై 16: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు నిర్ణయించినట్లు మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు తెలిపారు.

గురువారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామం లోని నాగోబా ప్రజా దర్బారులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాయి సెంటర్ల సార్ మేడిలు, ఆయా గ్రామాల పటేల్ ల తో పాటు రాజ్ గోండు సేవా సమితి మండల జిల్లా స్థాయి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన పెద్దలను ఉద్దేశించి మాజీ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. ఆగస్టు 9వ తేదీన ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సమీపంలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు ఇప్పటినుండి గ్రామస్థాయిలో ప్రచారం చేయాలన్నారు.

ఆదివాసీ దినోత్సవానికి రాష్ట్రంలోని ఆదివాసి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆదివాసీ దినోత్సవం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు అక్కు పత్రాలతో పాటు అసైన్డ్ భూములకు రెవిన్యూ పట్టాలు అందజేయాలని ముఖ్యమైన డిమాండ్ ఉందన్నారు. ఆదివాసుల నాయకుల స్వార్థం కొరకు ఆదివాసుల ఐక్యత కోల్పోతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

రాయి సెంటర్లు, గ్రామ పటేళ్లు, రాజ్ గోండు సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి ఉమ్మడి జిల్లాలోని గిరిజన గుడాల ఆదివాసులు తండోపతండాలుగా 50 వేలకు పైగా హాజరై ఆదివాసీల ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశానికి కేస్లాపూర్ రాయి సెంటర్ సార్ మేడి మెస్రం వెంకట్రావు అధ్యక్షత వహించగా, రాయి సెంటర్ల జిల్లా మేడి తొడసం అమృతరావ్, రాయి సెంటర్ల సార్ మేడిలు, రాజ్ గోండు సేవా సమితి జిల్లా అధ్యక్షులు కుంర జంగు, కుర్సెంగా మొతిరం, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావ్, రాజ్ గోండు సేవాసమితి జాతీయ నాయకుడు ఫ్రీడం అర్జు మాస్టర్ ల తో పాటు సర్పంచులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.