17 July, 2026 | 1:38 AM

వైభవంగా పూరి జగన్నాథ్ రథయాత్ర

17-07-2026 01:27 AM
  1.   10 లక్షల మందికిపైగా భక్తులు హాజరు
  2. దేవతా మూర్తులను తీసుకొస్తుండగా స్వల్ప తొక్కిసలాట
  3. ఒకరి మృతి.. 150మందికిపైగా శ్వాస ఆడక ఆస్పత్రికి

భువనేశ్వర్, జూలై 16: ఒడిశా భువనేశ్వర్ పూరి ప్రముఖ పుణ్యక్షేత్రంలో గురువారం ప్రారంభమైన జగన్నాథ్ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. దేశ నలుమూలల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. భారీ వర్షంలోనూ.. భక్తులు ‘జై జగన్నాథ్’ నామస్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. బలభద్రుడు, సుభద్రాదేవి, కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ‘గ్రాండ్ రోడ్’పై రథాలపై దేవుళ్లను చూసిన అశేషజనవాహిని భక్తిపారవశంతో తన్మయత్వం చెందారు.

లక్షలాది మంది భక్తులు మొదట బలభద్ర స్వామి వారి ‘తలధ్వజ’ రథాన్ని, ఆ తర్వాత దేవి సుభద్ర రథం ‘దర్పదలన’ను లాగారు. వీరి వెనుక జగన్నాథ స్వామి వారి ‘నందిఘోష’ రథం కదిలింది. అయితే రథయాత్రలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ రద్దీతో తొక్కిసలాట జరిగి ఒకరి మృతి చెందినట్లు సమాచారం. శాశ్వ ఆడక ఇబ్బంది పడుతున్న 150మందిని భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

పూరి గజపతి మహారాజ దివ్యసింహదేవ్ మూడు రథాల ముందున్న మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి రథయాత్రను ప్రారంభించారు. ఈ ఆలయం నుంచి, దేవుళ్ల జన్మస్థలంగా భావించే సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రథయాత్ర గుండిచా ఆలయం వరకు కొనసాగింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో, ‘హరి బోల్’ నినాదాలు, తాళాలు, బాకాలు, శంఖాల ధ్వనుల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాన్ని వీక్షించారు.

అంతకుముందు, ‘పహండి’ లేదా సంప్రదాయ ఊరేగింపు ద్వారా దేవుళ్ల విగ్రహాలను రథాల వద్దకు తీసుకువచ్చారు. ముందుగా శ్రీ సుదర్శనుడు రథం ఎక్కగా, ఆ తర్వాత దేవి సుభద్ర, బలభద్ర స్వామి, జగన్నాథ స్వామి రథం ఎక్కారని ఆలయ అధికారి తెలిపారు. రథయాత్ర వెళ్లే మార్గంలో, వర్షపు నీరు నిల్వ ఉండకుండా, ఊరేగింపు సాఫీగా సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతి సంవత్సరం ఒడియా మాసమైన ‘ఆషాఢ శుక్ల పక్షం’ రెండో రోజున జరిగే రథయాత్ర, ఆలయంలోని రత్న సింహాసనం (రత్నఖచిత సింహాసనం) నుంచి ఆ దేవుళ్లను బయటకు తీసుకువచ్చే ఏకైక సందర్భం ఇదే. భారీ వర్షం భక్తుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయింది. వారు ‘గ్రాండ్ రోడ్’పై నృత్యం చేస్తూ రథోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం నుంచి పూరీలో గురువారం వరకు 23.3 సెం.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక : ప్రధాని మోదీ

పూరి రథయాత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో ఒడిశా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే జగదల్పూర్, రాయ్‌గఢ్ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

యాత్రలో భద్రత కోసం 13వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా రు. 473 ఏఐ సీసీటీవీ కెమెరాలు, 65 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అహ్మాదాబాద్‌లో జరిగిన రథయాత్రలో హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సీఎం భూపేంద్ర పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్విలు రథయాత్రను ప్రారంభించారు. అటు పాట్నాలో సీఎం సమ్రాట్ చౌదరి జగన్నాథ స్వామికి హారతి ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు.

రథం లాగేందుకు తోసుకురావడంతో తొక్కిసలాట!

జగన్నాథుడి గర్భగుడి నుంచి రథం వద్దకు దేవతా మూర్తులను తీసుకువస్తున్న సమయంలో ఒక్కసారిగా చూసి రథాలను లాగేందుకు బడా దండా (గ్రాండ్‌రోడ్)పై వేచి ఉన్న భక్తులు దూసుకొచ్చారు. అకస్మాత్తుగా ఏర్పడిన భారీ జనసమూహం తోపులాటకు దారితీసి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గుప్తా అనే వ్యక్తి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డ 150 మందికి పైగా ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.