17 July, 2026 | 2:25 AM

ఏసీబీ కేసుల్లో శిక్షలేవీ?

17-07-2026 02:13 AM

దాడుల్లో దూకుడు.. ఏళ్ల తరబడి వెలువడని తీర్పులు

రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు.. కీలక శాఖల్లో పట్టుబడుతున్న ఉన్నతాధికారులు

కోట్ల అక్రమాలు వెలుగులోకి.. 

అరెస్టులు జరుగుతున్నా న్యాయ విచారణలో జాప్యం

* ఒకప్పుడు వందలు, వేల రూపాయల లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏసీబీ దాడుల్లో  బయటపడుతున్నవి చిన్న మొత్తం లంచాలు కాదు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తు లు.  ఒక్కో అధికారి ఇంటి తలుపు తడితే.. గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి, ఖరీదైన విల్లాలు, పదుల సంఖ్యలో ప్లాట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, లగ్జరీ కార్లు, బినామీ పెట్టుబడులు, భారీ బ్యాంకు డిపాజిట్లు బయటపడుతు న్నాయి.

అధికారిక లెక్కల్లో అక్రమ ఆస్తుల విలువ కొన్ని కోట్లుగా నమోదవుతున్నా, వాటి మార్కెట్ విలువ మాత్రం రూ.100 కోట్లకు పైగానే ఉండటం.. ప్రభుత్వ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి ప్రశ్నిస్తోంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడుల్లో బయ టపడుతున్న అక్రమాస్తులే అందుకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నరేళ్లుగా ఏసీబీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది.

ఈ దాడుల్లో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, హెచ్‌ఎం డీఏ, రోడ్లు- భవనాలు, మెట్రో వాటర్ వర్క్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రవాణా వంటి కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు చిక్కుతున్నారు. ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడటమేకాదు.. అరెస్టులూ జరుగుతున్నాయి.

కానీ పట్టుబడిన వారిలో ఎంతమందికి తక్షణ శిక్షలు పడ్డాయి? ఏళ్ల తరబడి కేసులు ఎందుకు పెండింగ్‌లోనే ఉంటు న్నాయి? అనేది ప్రశ్నార్తకంగానే మిగిలిపోతుంది. ఈ పరిస్థితికి ప్రాసిక్యూషన్ అనుమతుల్లో జాప్యమా? కోర్టుల్లో పెండింగ్ కేసులా? వ్యవస్థలోని లోపాలా? అవినీతిపై ఏసీబీ దూకుడు ప్రదర్శించిన స్థాయిలో నిందితులకు ఎందుకు శిక్ష పడటం లేదనే చర్చ జరుగుతోంది. 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఏసీబీ చర్యలతో వెలుగులోకి వస్తున్న గణాంకాలు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు 724 కేసులు నమోదవగా, వీటిలో గడిచిన రెండున్నర ఏళ్లలో నమోదైనవి 441 కేసులు ఉన్నాయి..

2024లో 145 కేసులు నమోదు కాగా, 2025లో 199కు పెరిగాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 37 శాతం కేసు లు పెరిగాయి. 2025లో 273 మందిని అరె స్ట్ చేయగా, వారిలో 176 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కావడం గమనార్హం.

ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో బయటపడుతున్న అక్రమ సంపాదన కూడా గణనీయంగా పెరుగుతోంది. 2025లో ఏసీబీ అధికారికంగా రూ.96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించగా, 2026లో జూలై నాటికే రూ.36.92 కోట్ల ఆస్తులను గుర్తించింది. అయితే ఇవి ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం విలువలు మాత్రమే. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

శాఖల వారీగా చూస్తే పోలీ స్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లు-భవనాలు వంటి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న శాఖల్లోనే అవి నీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2026 జూన్ 16 వరకు నమోదైన కేసుల ప్రకారం పోలీస్ శాఖ 14, రెవెన్యూ శాఖ 13, మున్సిపల్ శాఖలో 8, పంచాయతీరాజ్ శాఖలో 8, విద్యాశాఖలో 6 కేసులు నమోదయ్యాయి. అదనంగా ఇరిగేషన్, రోడ్లు- భవ నాలు, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాన్స్‌పోర్ట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వంటి శాఖల్లోనూ ఇటీవల భారీ అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వచ్చాయి.

అధికారిక  విలువ ఎక్కువే..

ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్ర మ ఆస్తుల విలువపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు ప్రకటించే ఆస్తుల విలువ సాధారణంగా ప్రభు త్వ గైడ్‌లైన్ (రిజిస్ట్రేషన్) విలువ ఆధారంగా ఉంటుంది. అయితే అదే ఆస్తులను బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే వాటి విలువ అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇటీవలి డీఏ కేసుల్లో అధికారికంగా రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య ఆస్తులు గుర్తించినా, మార్కెట్ విలువ మాత్రం రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పైగా ఉంటోందని దర్యాప్తులో తేలుతుంది. కొన్ని ప్రముఖ కేసుల్లో అధికారిక లెక్కల్లో రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నమోదు చేసిన ఆస్తులు, మార్కెట్లో రూ.100 కోట్లకు మించిన విలువ కలిగి ఉన్నట్లు ఏసీబీ అంచనా వేసింది.

దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్ణయించే రిజిస్ట్రేషన్ విలువలు, మార్కెట్‌లో వాస్తవంగా జరుగుతున్న కొనుగోలు, అమ్మకాల ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతా లు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ కంటే ఎక్కువగా ఉంటుం ది.

అందువల్ల అధికారికంగా ప్రకటించే ఆస్తుల విలువ కంటే వాస్తవ విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ బినామీ ఆస్తులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న పెట్టుబడులు, కంపెనీల్లో వాటాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక పెట్టుబడులు వెలుగులోకి వస్తే మొత్తం అక్రమ సంపద విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల్లో గుబులు

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఒకప్పుడు కింది స్థాయి ఉద్యోగులకే పరిమితమైన ఏసీబీ చర్యలు ఇప్పుడు చీఫ్ ఇంజినీర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జనరల్ మేనేజర్లు, ఈఎన్సీలు, డీఎస్పీలు వంటి ఉన్నతాధికారుల వరకు చేరడంతో వివిధ శాఖల్లో అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వరుసగా సోదాలు జరగడం, కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడటం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దీంతో అనేక శాఖల్లో పెద్దస్థాయి అధికారులపై కూడా చట్టం ఒకేలా అమలవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఉన్నతాధికారులపైనే ఏసీబీ ఎక్కువ దృష్టి పెట్టడంపై ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల్లో కూడా చర్చ జరుగుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి తమపై కూడా ఏసీబీ దృష్టి సారిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం కావాలనే అవినీతిని కట్టడి చేసేందుకే ఈ చర్యలు చేపడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. 

తుది తీర్పుకు ఏళ్ల తరబడి..

అవినీతి కేసుల్లో ఏసీబీ దూకుడు పెంచి వరుసగా దాడులు నిర్వహిస్తు న్నా... శిక్షల విషయంలో మాత్రం అదే వేగం కనిపించడం లేదు. అధికారులు ప్రత్యక్షంగా పట్టుబడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడు తున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కానీ కోర్టుల్లో కేసులు తుది తీర్పుకు చేరుకోవడానికి మాత్రం ఏళ్ల సమయం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రాసిక్యూషన్ అనుమతుల్లో జాప్యం.

అవినీతి కేసులో ప్రభుత్వ ఉద్యోగిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయా లంటే సంబంధిత శాఖ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి. అయితే అనేక శాఖల్లో ఈ ఫైళ్లు నెలలు కాదు.. ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వందలాది కేసులు ఇప్పటికీ అనుమ తుల కోసం ఎదురు చూస్తున్నాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, 2021 నుంచి నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికీ సుమారు 25 శాతం కేసుల్లో మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతులు లభించాయి.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెవెన్యూ శాఖకు చెందిన 400కు పైగా కేసులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతులు ఆలస్యమవడంతో చార్జిషీట్లు దాఖలు చేయ డం, విచారణ ప్రారంభించడం కూడా ఆలస్యమవుతోంది. మరోవైపు ప్రత్యేక ఏసీబీ కోర్టుల్లో పెండింగ్ కేసులు, తరచూ వాయిదాలు, సాక్షుల హాజరు సమస్య లు, అప్పీళ్ల ప్రక్రియ కూడా కేసుల పరిష్కారాన్ని మరింత ఆలస్యం చేస్తున్నాయి.

ఈలోపు సస్పెన్షన్ గడువు పూర్తయిన కొంతమంది అధికారులు తిరిగి విధుల్లో చేరి, మరికొన్ని సందర్భాల్లో మళ్లీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినీతిని సమర్థంగా అరికట్టాలంటే దర్యాప్తు మాత్రమే కాదు, న్యాయ ప్రక్రియ కూడా అదే వేగంతో సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులపై ప్రాసిక్యూషన్ అనుమతులు ఇచ్చే ప్రక్రియకు నిర్దిష్ట కాలపరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అలాగే ప్రత్యేక ఏసీబీ కోర్టుల సంఖ్య పెంచి, అవినీతి కేసులను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో విచారిస్తే పెండింగ్ కేసులు తగ్గే అవకాశం ఉంది. పట్టుబడిన ప్రతి కేసు సత్వరంగా తుది తీర్పుకు చేరినప్పుడే ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెరిగి అవినీతికి నిజమైన అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.