calender_icon.png 20 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 వేల కోట్ల జీఎస్టీ స్కాం

20-02-2026 12:17:20 AM

ఒక్క తెలంగాణలోనే 1,500 కోట్ల ఎగవేత

  1. లెక్కల్లో వాస్తవిక ఆదాయకంటే.. తక్కువ ఆదాయం 

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగించి డాటా తొలగించిన రెస్టారెంట్ యాజమాన్యాలు

జీఎస్టీ, ఐటీశాఖ సాధారణ తనిఖీల్లో గుర్తింపు

తర్వాత అన్ని నగరాల్లోనూ దాడులు.. 60 టీబీల డాటా విశ్లేషణ

రంగంలోకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్

యాజమాన్యాలపై చర్యలకు రంగం సిద్ధం

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి ౧౯: (విజయక్రాంతి): తీగలాగితే కొండంతా కదిలింది.. జీఎస్టీ ఎగవేతల బ్యాచ్ బండారం బట్టబయలైంది.. హైదరాబాద్‌తో మొదలైన ఈ తనిఖీ లు ఇప్పుడు యావత్ దేశమంతా పాకాయి. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు తదితర నగరాల్లోని రెస్టారెంట్లలో ఒకటి కాదు .. రెండు కాదు.. ఏకంగా రూ.౭౦ వేల కోట్ల స్కాం వెలుగు చూసింది.

గతేడాది నవంబర్‌లో ఆదాయపు పన్ను, జీఎస్టీ అధికారులు తమ సాధారణ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌లోని కొన్ని బిర్యానీ రెస్టారెంట్ల లెక్కలు పరిశీలించారు. ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. రెస్టారెంట్ల యాజమాన్యాలు జీఎస్టీ ఎగవేసేం దుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాయని నిర్ధారించారు. వాస్తవ ఆదాయాన్ని తక్కువగా చూపుతూ పన్నులు ఎగ్గొట్టేందుకు యత్నించారని తేల్చారు.

తర్వాత దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జీఎస్టీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అహ్మదా బాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ వంటి అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్‌ను వినియోగించి 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలకు సంబంధించి 60 టెరాబైట్ల (టీబీ) డేటాను విశ్లేషించి, దేశవ్యాప్తంగా వేలాది యాజమాన్యాలు జీఎస్టీ ఎగవేశాయని నిర్ధారించారు.

డాటాలో తేలిన వాస్తవాలు 

రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు బిల్లు చెల్లించిన తర్వాత, యాజమాన్యాలు వారికి బిల్లులు ఇస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సిస్టమ్ నుంచి డాటా తీసేస్తున్నాయి. అలా తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ, తక్కువ ఆదాయ పన్ను, జీఎస్టీ చెల్లిస్తూ వస్తున్నాయి. ఐటీ, జీఎస్టీ అధికారులు 2019 -26 మధ్య రూ.2.43 లక్షల కోట్ల బిల్లులను విశ్లేషించి, యాజమాన్యాలు ఏకంగా రూ.13,317 కోట్లను పోస్ట్ -బిల్లింగ్ డిలీషన్ ఫీచర్ ద్వారా తొలగించినట్లు తేలింది.

ఈ రెస్టారెంట్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వే ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాజమాన్యాలు ఏకంగా రూ.5,141 కోట్లు ఎగవేసినట్లు అంచనా. ఇందులో తెలంగాణలో రూ.౧,౫౦౦ కోట్లు ఎగవేసినట్లు తేలింది. అలాగే కర్ణాటకలో రూ.2,000 కోట్లు, తమిళనాడులో రూ. 1,200 కోట్ల ఎగవేత జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. రెస్టారెంట్లపై నిఘాకు ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రంగంలోకి దిగింది. కుంభకోణానికి సహకరించిన సాఫ్ట్‌వేర్ సంస్థలు, రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.