17 July, 2026 | 3:00 AM

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు

17-07-2026 02:43 AM

- అదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి

- మారుతిగూడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

బేల, జూలై 16 : పట్టణాల్లో, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురు వారం తెల్లవారుజామున బేల మండలంలోని మారుతిగూడ గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు.

గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో లీటర్ గుడుంబాతో పాటు గుడుంబా తయారీకి వినియోగిస్తున్న పాత్రలు, సామగ్రిని, తయారీ కోసం నిల్వ ఉంచిన మహువా పూల పులిసిన ద్రావణాన్ని ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జీ శ్రావణ్ కుమార్, ఎస్‌ఐలు మధుకృష్ణ, గౌతమ్, పీర్ సింగ్ నాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.