4 August, 2026 | 1:28 AM

ధాన్యం నిల్వల విస్తరణకు మద్దతు

04-08-2026 12:05 AM
  1. సేకరణకు అనుగుణంగా ఆధునిక గోదాములు
  2. రైతులకు ఇబ్బందులు తలెత్తనీయం
  3. సేకరణ, రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తాం
  4. ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): తెలంగాణలో ఏటా పెరుగుతున్న ధాన్యం సేకరణకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆధునిక గోదాముల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి, కేంద్ర పూల్‌కు తెలంగాణ అందిస్తున్న సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అనూజ్ త్యాగి సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ సదుపాయాలు, రవాణా వ్యవస్థతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గోదాముల సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో ధాన్యం సేకరణ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌సీఐ  నిల్వ సామర్థ్యాన్ని అత్యవసరంగా విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని సంస్థ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గోదాములను నిర్మించి, ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని గణనీయం గా పెంచే ప్రణాళికలను వివరించారు. ఎఫ్‌సీఐ ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. నిల్వ సామర్థ్య విస్తరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత శాఖల మధ్య సమన్వయం, చట్టబద్ధమైన అనుమతుల మంజూరు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు నిల్వ సామర్థ్యాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమరు. సేకరణ సీజన్లలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొనుగోలు కేంద్రాల నుంచి గోదాముల వరకు ధాన్యం తరలింపు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించాలని సూచించారు.

ధాన్యం సేకరణలో సమర్థత, నిల్వల నిర్వహణలో పారదర్శకత, రవాణాలో వేగం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం- ఎఫ్‌సీఐ మధ్య క్షేత్రస్థాయిలో మరింత సన్నిహిత సమన్వయం అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 తెలంగాణ దేశంలోనే రెండో అతిపెద్ద ధాన్యం సేకరణ రాష్ట్రంగా అవతరించిందన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ .. రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర పూల్‌కు సంబంధించిన నిల్వ సామర్థ్యం సుమారు 31 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని తెలిపారు.

ఎఫ్‌సీఐ నిల్వ ప్రమాణాల ప్రకారం తెలంగాణలో ఇంకా 16.25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య లోటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోటును అధిగమించేందుకు ఆధునిక గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, తెలంగాణ ధాన్య ఉత్పత్తి-సేకరణ స్థాయికి తగిన శాశ్వత నిల్వ వ్యవస్థను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.