4 August, 2026 | 2:32 AM

బ్రిజ్‌భూషణ్ నిర్దోషి

04-08-2026 01:24 AM

లైంగిక వేధింపుల కేసులో క్లీన్‌చిట్

బ్రిజ్‌తోపాటు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి

ఢిల్లీ రైస్ అవెన్యూ కోర్టు తీర్పు

ఆరోపణలకు తగిన ఆధారాలు లేవన్న న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఆగస్టు ౩: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్టు (అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ కోర్టు) సోమవారం తీర్పునిచ్చింది.

ఫిర్యాదుదారులు బ్రిజ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని పిటిషన్‌లో పేర్కొన్నారని, ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమవడంతోనే న్యాయస్థానం బ్రిజ్‌తోపాటు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా నిర్దోషులని ప్రకటించింది. రెజ్లర్ వినే ష్ ఫోగట్ సహా ఆరుగురు మహిళా రెజ్లర్లు 2023లో బ్రిజ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తర్వాత, రెజ్లర్లు దాఖ లు చేసిన పిటిషన్‌పై కోర్టు మే 2024లో 32 మంది సాక్షులను విచారించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

తీర్పు ఆనందాన్నిచ్చింది: బ్రిజ్

న్యాయస్థానం తీర్పుపై బ్రిజ్ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే, ఉరి వేసుకుంటా నని మొదటి రోజే చెప్పానని గుర్తుచేశారు. కోర్టు తనకు కేసుల నుంచి విముక్తినిచ్చిందని పేర్కొన్నారు.

మొత్తం యంత్రాంగం బ్రిజ్ వైపే: వినేష్ ఫోగట్

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించడం పై ఫిర్యాదుదారు, రెజ్లర్ వినేష్ ఫోగట్ స్పం దించారు. న్యాయస్థానం తీర్పు తమను బా ధించిందని భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. కీలక పదవిలో ఉన్న ఒక శక్తిమంతమైన నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే, ఎవరికైనా ఎంతో ధైర్యం కావాలని, అయినప్పటికీ మహిళా రెజర్లందరూ రోడ్లపైకి పోరాడారని గుర్తుచేశారు.

బ్రిజ్ తన అధికార బలాన్నంతా ఉపయోగించి కేసు నుంచి బయటపడ్డారని ఆరోపించారు. ఈ కేసులో మొదటి నుంచీ ప్రభుత్వాలు, యావత్ యంత్రాంగం బ్రిజ్‌ను కాపాడేందుకే పనిచేశాయని విమర్శించారు. ఒక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించినంత మాత్రాన తమ పోరాటం ముగిసిందని భావించవద్దని, న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.