4 August, 2026 | 2:34 AM

మంథని గల్లీల్లో మంత్రి

04-08-2026 12:54 AM
  1. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. బొక్కలవాగు చెక్‌డ్యామ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
  3. రత్నాపూర్‌లో కోకాకోలా పరిశ్రమ స్థల పరిశీలన
  4. యువతకు ఉపాధి కల్పించే అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యం
  5. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి/మంథని/రామగిరి, ఆగస్టు 3 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథనిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విస్తృతంగా పర్యటించారు. మంథని శివకిరణ్ గార్డెన్‌లో ఉచిత కానిస్టేబుల్, ఎస్సు శిక్షణ కేంద్రమైన మన ఊరు- కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం మరో 7 వేల పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, వసతి, భోజన వసతి కల్పిస్తున్నామని, రాబోయే 3 నెలలు రోజుకు 15 గంటలు కష్టపడి లక్ష్యాన్ని ముద్దాడాలని పిలుపునిచ్చారు.

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు రూ.2 కోట్లతో ప్రాజెక్ట్ షైన్ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్, డీ-సిల్టింగ్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల పార్కు అభివృద్ధికై శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని కంపెనీ ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

పరిశ్రమలకు కావలసిన విద్యుత్, నీరు, రహదారుల వసతి ప్రభుత్వం కల్పిస్తుందని, పరిశ్రమలు-ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. మంథని పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు, ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం మంథని సివిల్ ఆస్పత్రిలో నూతన డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కౌన్సిలర్ లు, తహసిల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, ఏఎంసీ చైర్మన్ వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కోకాకోలా సంస్థ ప్రతినిధులు, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మాజీ జడ్పిటిసి నాగినెని జగన్ మోహన్ రావు, మంథని, ముత్తారం మండలాధ్యక్షులు ప్రసాద్, బాలాజీ, నాయకులు శశి భూషణ్ కాచే, బొబ్బిలి శ్రీధర్, పేరవేని లింగయ్య యాదవ్, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.