4 August, 2026 | 1:43 AM

సంతోషంగా లేను.. క్రోధంతో వచ్చా

04-08-2026 12:41 AM
  1. విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే ప్రాణనష్టమే 
  2. ఈ ఏడాది కుంభవర్షాలు.. ప్రజలు కొట్టుకుపోతారు
  3. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తాను
  4. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత
  5. అంబారీపై అమ్మవారి ఊరేగింపు
  6. విగ్రహ ప్రతిష్ఠాపనై త్వరలో నిర్ణయం: మంత్రి పొన్నం ప్రభాకర్

సికింద్రాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం కీలక ఘట్టం రంగం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంలో కార్యక్రమంలో భాగం గా  పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంగా లేనని.. క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధా నం చెప్పాలని అడిగారు.

మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయి. కుంభవర్షా ల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. వావి వరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తాను. ఆర్నెళ్లలో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణనష్టమే అని భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రినిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, కోట నీలిమ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంగం కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

వేడుకగా అంబారీపై అమ్మవారి ఊరేగింపు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో రెండో రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం అంబారీపై అమ్మవారి ఊరేగింపు భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఈ సాంప్రదాయ క్రతువును అధికారులు, పూజారులు నిర్వహించారు.’రంగం’ కార్యక్ర మంలో భాగంగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు.

భవిష్యవాణి కార్యక్రమం అనంతరం అమ్మవారి సాగనంపు ఘట్టంగా అంబారీపై అమ్మవారి చిత్రపటంతో ఊరేగింపు కన్నులపండువగా సాగింది. రంగంతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి తరలివచ్చారు. 

మా గౌరవానికి భంగం

  1. ధర్నాకు దిగిన జోగినిలు
  2. బాట కమాన్ వద్ద అడ్డుకున్న పోలీసులు

ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినీలకు అవమానం జరిగిందని జోగిన శ్యామల విచారం వ్యక్తం చేశారు. జోగినుల గౌరవానికి భంగం కలిగిందంటూ సోమవారం అంబారీ ఊరేగింపు సందర్భంగా పలువు జోగినీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ ఆర్‌పి రోడ్ బాట కమాన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పైన ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా జోగిని శ్యామల మాట్లాడుతూ.. ఘటనపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ పనితీరు బాగాలేదన్నారు. జోగినులకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయ శాఖ పరిధిలో జోగినులకు ప్రత్యేక స్థానాలు, హోదాలు ఇవ్వాలన్నారు. బోనాల ఉత్సవాల్లో జరిగిన అపచారాన్ని సరిదిద్దాలని కోరారు. వారం రోజుల్లో తిరిగి బోనాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు జోగినిలు ప్రకటించారు.