సింగరేణికి కొత్త ఊపిరి
- వేలంలో మణుగూరు పీకేఓసీ--2 దక్కడం చారిత్రక విజయం
- 20 ఏళ్లపాటు 120 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీతకు అవకాశం
- 2 వేల మంది ఉపాధికి
- కోయగూడెం--3, సత్తుపలి--3 బ్లాక్‌లనూ సాధిస్తాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): తొలిసారిగా వేలంలో పాల్గొని మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణి దక్కించుకోవడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతోపాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేయాలన్న సంకల్పంతో గత 30 నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ సింగరేణికి కొత్త ఊపిరి లభిస్తోందని చెప్పారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలంలో మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం చారిత్రక విజయమని పేర్కొన్నారు. అసలు ప్రారంభం అవుతుందా లేదా తెలియని స్థితిలో ఉన్న ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు అనుమతులు సాధించేందుకు తానే ఒడిశాకు వెళ్లి అక్కడి ప్రజా ప్రతినిధులను, ప్రజలను కలిసి ఒప్పించానని, ఫలితంగా 36 ఏళ్ల పాటు సంస్థకు బలమైన పునాది వేసే నైనీలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు.
అదే సమయంలో 2013 లో యూపీఏ హయాంలో మైనింగ్ అనుమతులు జారీ చేసిన తాడిచర్ల -2 బొగ్గు బ్లాక్ను గత బీఆర్‌ఎస్ పాలకులు విస్మరిస్తే తాము అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సంప్రదింపులు జరిపి గత నెల రెండో వారంలో మైనింగ్ లీజులు జారీ చేయించామని తెలిపారు. ఈ గని ద్వారా 336 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను 45 ఏళ్ల పాటు వెలికితీయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ ను దక్కించుకున్నామని చెప్పారు.
గత పాలకులు సింగరేణి సంస్థను వేలంలో పాల్గొనకుండా నిరోధించి మన రాష్ట్రంలోని విలువైన బొగ్గు బ్లాక్లను వారి అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు చేశారని, తాము సింగరేణి మనుగడ కోసం వేలంలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వడం వల్లే ఈ రోజు సింగరేణికి దాదాపు 12 ఏళ్ల తర్వాత వేలంలో ఒక బ్లాక్ దక్కిందని తెలిపారు. ఇది ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో నమోదైన ప్రజా విజయంగా అభివర్ణించారు.
మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ గనితో 120 మిలియన్ టన్నుల నాణ్యమైన జీ-8 గ్రేడ్ బొగ్గును వెలికితీయొచ్చని, ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు బొగ్గును మన విద్యుత్ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. ఈ ప్రాజె క్టు ద్వారా దాదాపు 2 వేల మందికి పైగా కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత లభించడమే కాకుండా, మణుగూరు ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అలాగే, ఈ బ్లాక్‌లోని నాణ్యమైన బొగ్గు నిల్వల ద్వారా రాబో యే 20 సంవత్సరాల పాటు తెలంగాణ విద్యుత్ అవసరాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడంతో రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.






