బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే!
- ఆలయాల్లో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ నాపై కాంగ్రెస్ దుష్ప్రచారం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిలకు లీగల్ నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): తాను ఆలయాల సందర్శనకు వెళ్తే క్షుద్ర పూజలు చేస్తున్నానంటూ తనపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారికి లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని లీగల్ నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. జూలై 31న కాంగ్రెస్ నేతలు కావాలనే ఒక వీడియో రికార్డ్ చేసి, అన్ని వార్తా ఛానెళ్లకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు పంపి ఈ దుష్ప్రచారానికి తెరతీశారని నోటీసుల్లో స్పష్టం చేశారు.
‘రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తద్వారా కరువు రావాలనే ఉద్దేశంతోనే హరీశ్‌రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ అబద్ధాలు మాట్లాడటాన్ని హరీశ్‌రావు తరఫు న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు. దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఆధారాలు లేకుండా చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వార్తా ఛానెళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో.. అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేక పోయినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.






