నేడు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల చలో బస్ భవన్
సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): 2017 వేతన సవరణ బకాయిలు, 2021 వేతన సవరణ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, గ్రాడ్యువిటీ డిఫరెన్స్‌తో పాటు ఇతర పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టనున్న చలో బస్ భ వన్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.
2013 నుంచి చెల్లించాల్సిన పీఎఫ్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించి రిటైర్డ్ కార్మికు లకు అధిక పెన్షన్ వచ్చేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం జరగబోయే చలో బస్ భవన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
నేషనల్ మజ్దూర్ యూనియన్ మద్దతు
మంగళవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి టీజీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సంఘం అధ్యక్షుడు పి.కమల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 2017 నుంచి రావలసిన పీఆర్‌సీ బకాయిలు, 2021 పీఆర్‌సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ వచ్చే విధంగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగంలో ఉన్న కార్మికులు వేలాది సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.






