17 July, 2026 | 2:51 AM

గురుకులంలో నీటి కటకట...

17-07-2026 02:35 AM

రోడ్డుపై నిరసనకు దిగిన విద్యార్థులు 

మహబూబాబాద్, జులై 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ లోని ట్రైబల్  వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు నీటి సమస్య తీర్చాలంటూ రోడ్డు ఎక్కి ధర్నాకు దిగారు. గత నెల రోజులుగా తాగునీటి సమస్య, దైనందిన కార్యక్రమాలకు నీటి సరఫరా లేదనీ, టాయిలెట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రిన్సిపల్, ఆర్ సీ వో , అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం లేవగానే కనీసం వాష్ రూమ్ కి పోదామంటే కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తలా పది రూపాయలు చెల్లిస్తే రిపేర్ చేయిస్తామంటూ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించమని ప్రిన్సిపాల్ ని కోరితే, ఈ విషయాలు బయటకు చెబితే మార్కులు తగ్గిస్తామని బెదిరించారని, దీనితో తాము నీళ్లు లేక బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇక తప్పని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

వెంటనే అధికారులు స్పందించి హాస్టల్ లో  నీటి వసతి కల్పించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో స్పందించిన అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రూప్ సింగ్ అక్కడికి వెళ్లి విద్యార్థులను శాంతింప చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ససేమిరా అన్నారు. దీనితో మంత్రి సీతక్కతో విద్యార్థుల చేత ఫోన్లో మాట్లాడించారు.  సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా తాను చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.