17 July, 2026 | 2:52 AM

దేవాదుల నీటితో గణపసముద్రం సరస్సు నింపాలి

17-07-2026 02:34 AM

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి

గ్రావిటీ కెనాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి 

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

గణపురం, రామప్ప సరస్సుల పరిశీలన

రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ 

గణపురం, జులై 16 (విజయక్రాంతి): దేవాదుల నీటితో గణపసముద్రం సరస్సు నింపాలని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండలంలోని గణపురం చెరువు  రామప్ప చెరువులను బిఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించి నీటిమట్టాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా రామప్ప నుంచి గణపురం చెరువుకు వెళ్లే గ్రావిటీ కెనాల్  రామప్ప నుంచి పాకాల వైపు ఉన్న పంప్ హౌస్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపురం చెరువు కాకతీయుల కాలం నాటి పురాతన చెరువుగా ఉండి, ఈ చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే గణపురం మండలం మాత్రమే కాకుండా భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని రైతులకు మోరంచ వాగు ద్వారా సాగునీరు అంది రెండు పంటలు పండించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం చెరువులో సుమారు 15 అడుగుల మేర మాత్రమే నీరు ఉండటం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో దేవాదుల పథకం ద్వారా రామప్ప నుంచి గణపురం చెరువుకు గ్రావిటీ కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచినప్పటికీ, అనంతర పరిణామాల నేపథ్యంలో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

అదేవిధంగా గణపురం, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు కూడా ఈ ప్రాంతం నుంచే సరఫరా అవుతోందని తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిపోవడంతో తాగునీటికీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల దేవాదుల ప్రాజెక్టు నుంచి రామప్పకు నీటిని పంపిస్తున్న నేపథ్యంలో, రామప్ప చెరువును పూర్తి స్థాయిలో నింపి, అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా గణపురం చెరువుకు నీటిని విడుదల చేసి, తాగునీరు సాగునీటి అవసరాలు తీరేలా చూడాలని ఆయన ఇరిగేషన్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి  భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు  చెల్పూరు మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు గణపురం మండల పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి మాజీ ఎంపిటిసి సభ్యులు అశోక్ రెడ్డి గణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి హఫీజ్ సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షుడు వైనాల వెంకటేష్ నాయకులు పిన్నింటి శ్రీనివాసరావు  గాజర్ల చింటూ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.