కేంద్ర ఔషధ గిడ్డంగిని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
మంచిర్యాల టౌన్, జూలై 16 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లో జిల్లా కేంద్ర ఔషద గడ్డింగిని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ రావుతో కలిసి గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తున్న మందుల వివరాలను, మందుల ఎక్స్పైరీ డేట్ లను, అలాగే కుక్క, పాము, తేలు కాటు మందుల స్టాకు వివరాలను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ శ్రీవాణి, ఫార్మసీ ఆఫీసర్ చంద్రయ్య, శ్రీనివాస్ లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని 19 పీహెచ్సీలకు, యూపీహెచ్సీలకు, బస్తీ దవాఖానాలు, సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎంసీహెచ్, తెలంగాణ డయగ్నోస్టిక్స్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ ఆస్పత్రులకు అవసరమయ్యే 352 రకాల మందులను జిల్లా కేంద్ర ఔషధ గిడ్డంగి ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ మందులు అన్ని ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ కోల్ చైన్ సిస్టంను సరిగా మెయింటెయిన్ చేయాలని, మందుల వివరాలను నమోదు చేసుకొని పర్యవేక్షించాలని ఆదేశించారు.
వర్షాకాలం ప్రారంభమైనందున కీటక జనిత వ్యాధులు, నీటితో వచ్చే వ్యాధులు, జ్వరాలు, అతి సారం, వాంతులు, విరోచనాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచి సమయానికి పంపించాలని, సరఫరాకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఆర్ బి ఎస్ కే వాహనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, మలేరియా అధికారి శ్రీనివాస్, రవి కిరణ్, సెంట్రల్ బ్యాంక్ స్టోర్స్ సిబ్బంది తదితరులున్నారు.






