15 April, 2026 | 8:08 PM

22 నుంచి సమ్మె

14-04-2026 01:36 AM

ఆర్టీసీ జేఏసీ నేతల ప్రకటన

  1. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందనేలేదన్న నేతలు
  2.   22న మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెలోకి..

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం థామస్‌రెడ్డి ప్రకటించారు. 22న ఫస్ట్ షిఫ్ట్ నుంచి సమ్మె ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. సోమవారం చర్చల్లో భాగంగా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత గోపాల్‌దాస్‌తో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ చర్చలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు కాలేదు.

దీంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె తేదీని ప్రకటించింది. ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రభు త్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టడంలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని కోరారు.

ఆర్టీసీ యాజ మాన్యం కార్మికుల సమస్యలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ ఎన్ని కలకు కమిటీ ఏర్పాటు చేశామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దానిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ను గెలిపించామని, కానీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను  పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యానికి లేదన్నారు.

ఆర్టీసీ యాజమాన్యం తమను సమ్మె చేసే విధంగా ప్రోత్సహించినట్లుగా ఉందన్నారు. తమ వెనుక 40 వేల మంది కార్మికులున్నారని, జేఏసీ అడుగు జాడల్లోనే వారుంటారన్నారు. 22లోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నామని, కొత్తవి అడగట్లేదన్నారు.

ఎక్కడ పనిచేసే కార్మికులు అక్కడే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సునితా గోపాల్‌దాస్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు. ఈ చర్చలో జేఏసీ కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తల యాదయ్య, సుద్దాల సురేష్, బీ యాదగిరి పాల్గొన్నారు. 

ఆర్టీసీ గైర్హాజరవడంతో సమ్మె ప్రకటన..

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసులపై చర్చలు జరగకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలకు గైర్హాజరవడంతో మూడోసారి కూడా జేఏసీ నేతలు, ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్యలో చర్చలు జరగలేదు. మార్చి 25న ఒకసారి, ఈనెల 9న రెండోసారి, ఈనెల 13న మూడోసారి చర్చలు జరగాల్సి ఉంది. ఆర్టీసీ అధికారులు హాజరు కాకపోవడంతో, ఇరుపక్షాల మధ్య చర్చలు జరగకపోవడంతో జేఏసీ నేతలు గతంలో చెప్పినట్లుగానే సమ్మె తేదీని సోమవారం ప్రకటించారు.