పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా
సత్తుపల్లి, జూలై 5 (విజయ క్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆదివారం సత్తుపల్లి మండలం, పట్టణంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవ పూజా కార్యక్రమంలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం రామగోవిందాపురం గ్రామంలో సిద్ధిని నాగేశ్వరరావువరమ్మ దంపతుల కుమారుడు మంగరాజు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తదుపరి నారాయణపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ బాధితుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.






