5 July, 2026 | 7:32 PM

హమాలీ వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి

05-07-2026 06:28 PM

జూలై 6న జరిగే 18వ ఆవిర్భావ సభకు వేలాది మంది కార్మికుల హాజరు

ఉప్పల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల హమాలీ వర్కర్స్ యూనియన్ 18వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జూలై 6న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,900 మంది హమాలీ కార్మికులు సభకు హాజరవుతారని, అనుబంధ సంఘాల సభ్యులతో కలిపి దాదాపు 5,000 మంది పాల్గొంటారని వెల్లడించారు. హమాలీ కార్మికులు సమాజానికి వెన్నెముకలాంటివారని, వారి శ్రమతోనే సరఫరా వ్యవస్థ సమర్థంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

యూనియన్ ఆవిర్భావం అనేది కేవలం ఒక సంస్థ స్థాపన మాత్రమే కాదని, కార్మికుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు గౌరవప్రదమైన జీవనానికి బలమైన పునాది అని అన్నారు. కార్మికులు సంఘటితంగా ఉన్నప్పుడే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఐకమత్యమే ప్రధాన బలమని స్పష్టం చేశారు.

ప్రతి కార్మికుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకొని క్రమశిక్షణతో పనిచేస్తే యూనియన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ మరింత అభివృద్ధి చెంది ప్రతి కార్మికుడి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, ఆవిర్భావ సభను ఘన విజయవంతం చేయాలని కోరారు.