6 July, 2026 | 2:16 AM

దుర్గంధ దుర్గం చెరువు

06-07-2026 12:55 AM
  1. ‘వందల కోట్ల సుందరీకరణ’ బూడిదలో పోసిన పన్నీరేనా’?
  2. మురుగు కూపంగా మారిన ఐటీ కారిడార్ గుండెకాయ
  3. రోజుకు లక్షల లీటర్ల మురుగునీరు నేరుగా సరస్సులోకి..
  4. సమన్వయ లోపంతో చేతులెత్తేసిన  హెచ్‌ఎండిఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు
  5. దుర్వాసన, దోమల బెడదతో విలవిల్లాడుతున్న స్థానికులు

శేరిలింగంపల్లి, జూలై 5 (విజయక్రాంతి): ఐకానిక్ కేబుల్ వంతెన, ఫ్లోటింగ్ రెస్టారెంట్, మ్యూజికల్ ఫౌంటైన్లతో హైదరాబాద్ పర్యాటక పటంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ’దుర్గం చెరువు’ (సీక్రెట్ లేక్) నేడు తీవ్ర దుర్గంధంతో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటివరకు పర్యాటకులను కనువిందు చేసిన ఈ అందాల సరస్సు, నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగు కూపంగా రూపాంతరం చెందింది. సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి పేరుతో గత కొన్నేళ్లుగా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసిన అధికారులు.. కనీస నిర్వహణను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాలాల మళ్లింపు హామీలు కాగితాలకే పరిమితం.

జూబ్లీహిల్స్, మాదాపూర్, కావూరి హిల్స్, గుట్టల బేగంపేట వంటి పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ లక్షల లీటర్ల మురుగునీరు (సీవరేజ్) ఎలాంటి శుద్ధి లేకుండానే నేరుగా దుర్గం చెరువులోకి ప్రవహిస్తోంది. చెరువులోకి వచ్చే నాలాలను మళ్లిస్తామని, అత్యాధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాలను  పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ  అధికారులు గతంలో ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీనికి తోడు చుట్టుపక్కల వెలిసిన భారీ వాణిజ్య సముదాయాలు, స్టార్ హోటళ్లు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, ఘన వ్యర్థాలు రాత్రికి రాత్రే చెరువులోకి చేరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

అధికారుల సమన్వయ లోపం..

దుర్గం చెరువు పరిరక్షణ విషయంలో ప్రభుత్వ విభాగాల మధ్య కనీస సమన్వయం కరువైంది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ, జలమండలి , జీహెచ్‌ఎంసీ , పర్యాటక శాఖల మధ్య బాధ్యతల లొల్లి కారణంగా చెరువు అనాథగా మారింది. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో అట్టహాసం చేసిన అధికారులు, ఇప్పుడు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు.

పర్యావరణవేత్తల ఆగ్రహం..

‘చెరువు నీటిపై గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నెలలు గడుస్తున్నా కనీసం టెండర్లు పిలిచి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. లక్షల మంది పర్యాటకులు వచ్చే ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ పక్కన కనీసం చెత్త డబ్బాలు  కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం. ఇక ప్రతిష్టాత్మక ఫ్లోటింగ్ రెస్టారెంట్ నుంచి వెలువడే వ్యర్థాలు సైతం నేరుగా నీటిలోనే కలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నెలకు లక్షల్లో మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తున్నా అవి ఎటు పోతున్నాయో సమాధానం చెప్పాలి.‘

హెచ్చరిస్తున్న నిపుణులు.. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు..

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మురుగునీరు తోడవ్వడంతో దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో పాటు దోమల బెడద విపరీతంగా పెరగడంతో మాదాపూర్, శేరిలింగంపల్లి పరిసర కాలనీల ప్రజలు డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి భయంకరమైన సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.ఇటీవల పర్యావరణ నిపుణులు చెరువులోని నీటి నమూనాలను పరీక్షించగా.. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు  పడిపోయాయని, ప్రమాదకర స్థాయిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్  పెరిగిపోయిందని తేల్చారు. ఫలితంగా చెరువులోని జీవవైవిధ్యం దెబ్బతిని, చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి.

తక్షణ చర్యలు తీసుకోకుంటే ఉద్యమమే..

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయకుండా, ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టి, ఎస్టీపీలను పునరుద్ధరించి, చెరువును గుర్రపుడెక్క బారి నుంచి రక్షించి పూర్వవైభవం తీసుకురావాలని, లేనిపక్షంలో కాలనీవాసుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

దుర్గంధంతో వాకింగ్ ట్రాక్‌పై ఒక్క క్షణం నిలబడలేం..

మెయింటెనెన్స్ లేక, మురుగు చేరడంతో దుర్గం చెరువు పరిసరాలు దుర్గంధభరితంగా మారాయి. వాకింగ్ ట్ప్రా మురుగు నీరు చేరి ఒక్క క్షణం నిలబడలేని దుస్థితి నెలకొందని స్థానిక బిజినెస్ మెన్ మహేష్ చారి తెలిపారు. గతంలో అధికారులు చర్యలు తీసుకున్నా పరిష్కారం కాలేదని, వెంటనే స్పందించాలని కోరారు.