5 July, 2026 | 7:32 PM

రైతు భరోసా నిధుల విడుదలపై హర్షం

05-07-2026 06:19 PM

చిత్రపటాలకు క్షీరాభిషేకం

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి 58 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని మానకొండూరు మండలాధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4 నాటికి 67.44 లక్షల మంది రైతులకు1.18 కోట్ల ఎకరాలకు 7.135.77 కోట్ల రైతు భరోసా నిధులు విడుదలయ్యాయని వివరించారు.

రైతు భరోసా నిధులను విడుదల చేసి అన్నదాతలకు బాసటగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరులో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు  క్షీరాభిషేకం చేశారు.

మానకొండూరు మండలంలో సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్ యాన్యుటి మోడల్( హ్యామ్) విధానంలో రోడ్ల నిర్మాణానికి11.540 కోట్ల నిధులు మంజూరు కాగా, మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో 75.67 కిలోమీటర్ల మేర 19 రోడ్ల నిర్మాణ పనులకు 58.29 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.