6 July, 2026 | 2:32 AM

జూదం గెలిపించేది డబ్బు కాదు.. ఓడిపోయేది జీవితం

06-07-2026 01:30 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): జూదం గెలిపించేది డబ్బు కాదు.. ఓడిపోయేది జీవితం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. యువత జీవితానికి దూరంగా ఉండాలని, లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎల్లారెడ్డి పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21,350 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జూదం అనేది కేవలం చట్ట విరుద్ధమైన చర్య మాత్రమే కాదు, అది కుటుంబాలను, భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని, నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం అని ఎస్పీ అన్నారు. జిల్లా ప్రజలు పేకాట జోలికి వెళ్ళవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశతో జూదానికి అలవాటు పడినవారు చివరకు అప్పుల పాలై కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారన్నారు.

కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి విలువ, జూదంలో గెలిచే 1000 రూపాయల కంటే ఎంతో గొప్పది అన్నారు. యువత తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై వెచ్చించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. చట్ట విరుద్ధ మార్గాలు ఎప్పటికీ శాశ్వత విజయాన్ని ఇవ్వవు అని యువత గ్రహించాల న్నారు. నిజాయితీ, కృషి, క్రమశిక్షణ, మాత్రమే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

జూదము, గేమింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం నేరమని గుర్తించా లన్నారు. జూదము, గేమింగ్, డ్రగ్స్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, స్థానిక పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని వ్యసనాల బారిన పడకుండా కాపాడటంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఎస్పి  పిలుపునిచ్చారు.