కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే
కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టారు
- నిర్మాణ ఖర్చు 94 వేల కోట్లే
- లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యం?
- 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు?
- కన్నెపల్లి పంపుహౌస్‌లను ఆన్ చేసి, నీటిని తరలించాలి
- లేదంటే 50 వేల మందితో వచ్చి మేమే ఆన్ చేస్తాం
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూలై 5 (విజయక్రాంతి): కాళే శ్వరం ప్రాజెక్టు కూలేశ్వరమైందని కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో ప్రాజెక్టును పడావు పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం నుంచి స్థిరీకరించిన కొత్త ఆయకట్టు 40 లక్షల ఎకరాలు, మిడ్ మానేరు నుంచి నీళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చునని, ఫ్లడ్ ఫ్లో ద్వారా పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు తరలించవచ్చని పేర్కొన్నారు.
కన్నెపల్లి పంపు హౌస్‌లను ఆన్ చేసి నీటిని తరలించాలని లేదంటే 50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామమని హెచ్చరించారు. కాళేశ్వరం నిర్మాణానికి 94 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్కు సోయి లేదు, మంత్రి ఉత్తమ్‌కు స్పృహ లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేటీఆర్ సందర్శించి, మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణలో భౌగోళికంగా గోదావరి, కృష్ణా నదులు పారుతున్నాయి, కానీ, నీళ్లు కిందున్నాయి. భూములు పైనున్నాయి, కింద ఉన్న నీటిని లిఫ్ట్ ద్వారా తరలిస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి, దిగువ ప్రాంతం నుంచి ఎగువకు నీటిని తరలించిన ఘనత కేసీఆర్‌ది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను సంప్రదించాం. కానీ 150 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తు పెంచితే నా ప్రాంతం మునుగుతుందన్నారు.
మేము మూడున్నరేళ్ల స్వల్ప సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాం. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం తుమ్మిడిహట్టిపై రెండున్నరేళ్ల నుండి టైంపాస్ చేస్తున్నారు’ అని విమర్శించారు. ఎంతటి కరువులోనైనా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని అధికారులు సూచించారు కాబట్టే మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి తాను పుట్టినప్పటి నుంచి వింటున్నానని, ఐదు దశాబ్దాలుగా కాం గ్రెస్ నాయకులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్ల సమాహారం, 21 పంపుహౌస్‌లు, సబ్‌స్టేషన్లు, 1531 కి.మీ. కాల్వలు అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయలేదని, మేడిగడ్డ పిల్లర్ల బ్లాక్‌ను నిర్మించేందుకు రూ.400 కోట్లు అవుతాయని, ప్రజలపై పైసా భారం పడకుండా ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చినా ఇంతవరకూ మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు.
కూలేశ్వరమైందంటూ పనికిమాలిన మాటలు..
‘కాళేశ్వరం కూలేశ్వరమైందని కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నుంచి స్థిరీకరించిన కొత్త ఆయకట్టు 40 లక్షల ఎకరాలు, మిడ్ మానేరు నుంచి నీళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఫ్లడ్ ఫ్లో ద్వారా పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు తరలించవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. కరువు పరిస్థితుల్లోనూ నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం కన్నెపల్లి. కానీ నేడు 98 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.
మిడ్ మానేరు నింపాలని మా నాయకులు కోరినా ఫలితం లేకుండాపోయింది. నీళ్ల లభ్యత ఎక్కడా లేకపోతే కన్నెపల్లి నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఎస్‌ఆర్‌ఎస్పీలోనూ నీళ్లు లేకుంటే రివర్స్ పంపింగ్‌లో నీళ్లు నింపుకోవచ్చు. 7 జిల్లాలకు సాగునీళ్లు, తాగునీళ్లిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం’ అని కేటీఆర్ అన్నారు. అప్పర్ మానేరులో అలుగు పొంగిందంటే కాళేశ్వరం వల్లనే అన్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో, కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో హైదరాబాద్‌లో తాగునీటి కోసం ఇవాళ 15 వేల వాటర్ ట్యాంకర్లు పెరిగాయని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణానికి 94 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రకటించారు. సీఎం రేవంత్కు సోయి లేదు, ఉత్తమ్‌కు స్పృహ లేదని విమర్శించారు.
2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం వచ్చాకనే కదా నీళ్లొచ్చాయని చెప్పారకు. పంజాబ్‌ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనేనని చెప్పారు. కాళేశ్వరంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. దరిద్రపు కాంగ్రెస్ హయాంలో సుంకిశాల గోడ కూలినా, వట్టెం పంపుహౌస్ కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు.
కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రైతులను గోస పెడుతున్నారని, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయన్నారు. ఆ విషయం కాంగ్రెస్ నాయకులకూ తెలిసినా నీళ్లిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, పంటలు పండితే మద్దతు ధర, కరెంటు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం భయం అని పేర్కొన్నారు. ఎన్డీఎస్‌ఏ, ఎన్డీఏను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి బతకాలని చూస్తున్నాడని విమర్శించారు.
కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, మోటార్లు ఆన్ చేసి, నీళ్లను ఎత్తిపోయకపోతే.. 50 వేల మంది తో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామన్నారు.
కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు
జనగామ (విజయక్రాంతి): కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్‌ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.
కాగా రాజకీయ కక్ష సాధింపు కోసం కన్నేపల్లి కి రాలేదని, కన్నేపల్లి పంపు హౌస్ వద్ద నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయాలని రైతులు కోరుతున్నారని, అందుకే కన్నెపల్లికి రావాల్సి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకునేందుకు 4 గంటలు పడుతుంది కానీ పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్‌లో అడుగడుగునా మమ్మ ల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కన్నేపల్లికి చేరుకున్నాం’ అని కేటీఆర్ అన్నారు.






