6 July, 2026 | 3:25 AM

కట్టింది, కూల్చింది బీఆర్‌ఎస్సే

06-07-2026 02:17 AM

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

  1. మూడు బరాజ్‌లకు ముప్పుంది.. కాపాడేందుకు కాంగ్రెస్ చర్యలు
  2. వచ్చే జూలై వరకు ప్రాజెక్టు పునరుద్ధరణ 
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి 
  4. బీఆర్‌ఎస్ నేతలకు ఇంజినీరింగ్‌పై అవగాహన లేదు 
  5. పంపులను ఆన్ చేయాలనడం అవివేకమని విమర్శ

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది, కూల్చింది బీఆర్‌ఎస్సే.. కాపాడేది కాంగ్రె స్ ప్రభుత్వమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన నిర్మాణ లోపాలను దాచిపెట్టి ప్రజల ను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేస్తుందని దుయ్యబట్టారు.  ఆదివా రం సచివాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడా రు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని కన్నేపల్లి పంప్‌హౌస్‌ను వెంట నే ప్రారంభించి నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. ‘పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదు.. అసలు చేయలేం. శాస్త్రీ య పునరావాసం పూర్తయ్యే వరకు మూడు బ్యారేజీలను నిర్వహించరాదని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించింది. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే నిర్ణయం ఈ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదు’ అని తేల్చి చెప్పారు.

కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణం లో కాకుండా ఇంజినీరింగ్ కోణంలో చూడాలని మంత్రి సూచించారు. మూడు బ్యారేజీల పునాదుల పటిష్టతపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అనుమానం వ్యక్తం చేసిందని, తుది నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌ల పునాదుల్లో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నదని మంత్రి తెలిపారు. మూడు బరాజ్‌లపై గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేలు, 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్, హైడ్రాలిక్ మోడలింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు వంటి అత్యాధునిక పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఈ పనులను పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్, అంతర్జాతీయ కన్సల్టెంట్ ఏఎఫ్‌ఆ ర్‌వై, ఐఐటీ ముంబాయి, ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు వెల్ల డించారు. డిజైన్లను ఖరారు చేసి, వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జూలై 2027 నాటికి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అప్పటి వరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో స్థితిలోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లోపాలను సరిచేయకుండా నీటిని నిల్వ చేస్తే భద్రాచలం సహా దిగువ ప్రాంతాల్లో తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు.  

బీఆర్‌ఎస్‌వి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు..

ప్రాణహిత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు ప్రాణహిత ప్రాజెక్టును అమలు చేసి ఉంటే ఉత్తర తెలంగాణకు గ్రావి టీ ద్వారా సుమారు 80 టీఎంసీల స్థిర నీటి భద్రత లభించేదని తెలిపారు. రాజకీయ, వాణి జ్య ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పనను మార్చడం వల్లే నేడు ఈ పరిస్థితి ఏర్ప డిందని విమర్శించారు. ప్రాణహిత అసలు రూపం అమలై ఉంటే ఎల్ నినో వంటి పరిస్థితుల్లో కూడా ఉత్తర తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొనేది కాదని ఆయన చెప్పారు. 

కాళేశ్వరం పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 80 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను వేగవంతం చేసిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ, సాగునీరు, తాగునీటి రంగాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ  సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.  సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కా ర్యదర్శి శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజనీర్-ఇన్-చీఫ్ (జనరల్), సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.