6 July, 2026 | 3:22 AM

పూడిక ముప్పు!

06-07-2026 02:13 AM
  1. జలాశయాల్లో ఏటికేడు పెరుగుతున్న సమస్య  
  2. నీటి నిల్వలకు ఆటంకం వరదొచ్చినా నిల్వ చేయలేని దుస్థితి  
  3. పాత ప్రాజెక్టుల్లో 63 టీఎంసీల సామర్థ్యం తగ్గుదల   
  4. సాగు, తాగు నీటిపై తీవ్ర ప్రభావం 6 లక్షల ఎకరాల భవిష్యత్ ప్రశ్నార్థకం   
  5. పూడిక సమస్యపై ప్రభుత్వం ఫోకస్.. 
  6. కేరళం నమూనాపై ఉత్తమ్ ఆధ్వర్యంలో అధ్యయనం

హైదరాబాద్, జూలై 5(విజయక్రాంతి): ఏటేటా పెరుగుతున్న పూడికతతో జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి వరదలు వచ్చినా సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండాపోతుంది. డీసిల్టింగ్ పనులు చేపట్టకపోవడంతో సాగు, తాగునీటి నీటి లభ్యతపై ప్రభావం పడుతోంది.

వెరసి తెలంగాణ నీటిపారుదల రంగానికి సవాల్ ఎదురవుతోంది. రాష్ట్రంలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్, కడెం, జూరాల, మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో భారీగా పూడిక పేరుకుపోయినట్లు నీటి నిల్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల వాస్తవ స్టోరేజీ సామర్థ్యం 241 టీఎంసీలు కాగా, 178 టీఎంసీలకు తగ్గిపోయాయి. అంటే దాదాపు 63 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పూడిక కారణంగా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల  సామర్థ్యం చూస్తే ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తర తెలంగాణకు జీవనాడిగా భావించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైంది. ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయినట్లు అంచనా. అలాగే నిజాంసాగర్  సామర్థ్యం 29.72 టీఎంసీలు కాగా.. 11 టీఎంసీలకు కుంచించుకుపోయింది. మిగతా ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక టీఎంసీతో సగటున 10 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 63 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల ఆయా ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం చూపుతోంది. నీటి లభ్యత లేకపోవడం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పూడిక పెరగడానికి ప్రధాన కారణాలు..

జలాశయాల్లో పూడిక పెరగడానికి సహజ, మానవ తప్పిదాలు ప్రధాన కారణాలుగా నిపుణులు సూచిస్తున్నారు. నదుల పరీవాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, అక్రమ ఇసుక తవ్వకాలతో నేల కోతకు గురవుతోంది. భారీ వర్షాలు, వరదల సమయంలో కొండలు, వాగులు, నదుల నుంచి కొట్టుకొచ్చే మట్టి, ఇసుక, చిన్న రాళ్లు నేరుగా ప్రాజెక్టుల్లోకి చేరి జలాశయాల అడుగున పేరుకుపోతున్నాయి.

మరోవైపు చెక్‌డ్యాంల నిర్మాణం, వాటర్‌షెడ్ అభివృద్ధి, నేల కోత నియంత్రణ, నదుల పరీవాహక ప్రాంతాల్లో అటవీకరణ వంటి ముందస్తు చర్యలు ఆశించిన స్థాయిలో చేపట్టకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఏళ్ల తరబడి పూడిక తొలగించకపోవడం వల్ల వరదలకు వచ్చే సిల్ట్ పేరుకుపోతూ నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ప్రాజెక్టులు త్వరగా నిండుతున్నప్పటికీ, గతంలో మాదిరిగా ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. 

నిపుణుల సూచనలు..

ప్రాజెక్టుల్లో పూడిక సమస్య శాశ్వతంగా పోవాలంటే కేవలం డీ-సిల్టింగ్ చేయడం వల్లనే సాధ్యంకాదని నిపుణులు సూచిస్తున్నారు. నదుల పరీవాహక ప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి, చెక్ డ్యాంల నిర్మాణం, నేల కోత నియంత్రణ చర్యలు, విస్తృతస్థాయిలో అటవీకరణ చేపట్టడం అవసరమని అంటున్నారు.

అక్రమ ఇసుక తవ్వకాలు, గనుల తవ్వకాలపై కఠిన నియంత్రణ విధించడంతో పాటు, ప్రాజెక్టుల్లో క్రమం తప్పకుండా బాతిమెట్రిక్ సర్వేలు నిర్వహించి ఎంత మేరకు పూడిక పేరుకుపోయిందో అంచనా వేసి, దశలవారీగా డీ-సిల్టింగ్ చేపట్టాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని కాపాడుకోవడంపై కూడా ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణ చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం..

పాత జలాశయాల్లో పూడిక సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 20 ఏళ్లకు పైబడిన ప్రాజెక్టుల్లో శాస్త్రీయ పద్ధతిలో డీ-సిల్టింగ్ చేపట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ముఖ్యంగా కేరళంలో మంగళం అనకట్ట డీ-సిల్టింగ్ నమూనాపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.

పూడిక తొలగింపుతో పాటు భవిష్యత్తులో మళ్లీ సిల్ట్ పేరుకుపోకుండా వరద నియంత్రణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి, నేల కోత నివారణ చర్యలను సమన్వయం చేసే సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాస్త్రీయ విధానంలో డీ-సిల్టింగ్ చేపడితే జలాశయాల అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సాగునీరు, తాగునీటి అవసరాలను దీర్ఘకాలికంగా భద్రపరచవచ్చని అధికారులు భావిస్తున్నారు.

కొత్త ప్రాజెక్టుల నిర్వహణలో సవాళ్లు..

కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికి  సవాల్‌గా మారింది. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు పూడిక కారణంగా సామర్థ్యాన్ని కోల్పోతే వాటి  లక్ష్యం దెబ్బతింటుందని నిపుణు లు హెచ్చరిస్తున్నా రు. వర్షాలు సమృద్ధిగా కురిసినా నీటిని నిల్వ సామర్థ్యం తగ్గిపోతే సాగు, తాగునీటి సరఫరాపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పాత జలాశయాల నిర్వహణ, క్రమం తప్పకుండా డీ-సిల్టింగ్, బాతిమెట్రిక్ సర్వేలు, పరీవాహక ప్రాంతా ల సంరక్షణ వంటి చర్యలను నీటి నిర్వహణలో భాగం చేయాల్సిన అవసరం ఉంది.