9 May, 2026 | 7:27 PM

ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు

09-05-2026 06:29 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట మండలం, ‘సెన్సెస్-2027’ మొదటి దశలో భాగంగా మే 11 నుండి ప్రారంభం కానున్న ఇండ్ల గణన ప్రక్రియపై చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ... గణన కోసం వచ్చే ఎనిమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.

ఈ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా గణన సమయంలో గోప్యతా నియమాల దృష్ట్యా ఆధార్ నంబర్ గాని, ఓటీపీ  గాని చెప్పవలసిన అవసరం లేదని, కేవలం ఇంటి నంబరు, ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే తెలపాలని సూచించారు. అలాగే ప్రజలు స్వయంగా 'సెల్ఫ్ ఎనిమరేషన్' చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ భూమేష్, సర్పంచ్ నర్సింహా, ఉపసర్పంచ్ స్వామి, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా, మండలంలోని ప్రతి ఓటరు తమ ఓటర్ మ్యాపింగ్, ప్రోజెనీ వివరాలను తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని తాసిల్దార్ సూచించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం బూత్ స్థాయి అధికారుల (బిఎల్వో) ద్వారా నిర్వహించబడుతోందని, వివరాలు అందించని యెడల భవిష్యత్తులో ఓటు తొలగించబడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు ఈ విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా వారు అన్నారు.