9 May, 2026 | 7:38 PM

చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!

09-05-2026 06:26 PM

పాల్వంచలో కోట్ల పనులు పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం..!

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను రెండు భారీ ప్యాకేజీలుగా విభజించడం దారుణమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, సుమారు రూ 6,98,86,389, రూ 7,57,41,290 విలువ గల రెండు ప్యాకేజీల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ 14,56,27,679 కాగా, చిన్న చిన్న పనులను కావాలనే కలిపి భారీ ప్యాకేజీలుగా మార్చారని విమర్శించారు.

ఇలా చేయడం ద్వారా స్థానికంగా ఎన్నో సంవత్సరాలుగా చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీలో ఉన్న ఒక వ్యక్తికి ఈ పనులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. స్థానిక చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టి కోట్ల రూపాయల పనులను ఒకే వ్యక్తికి కట్టబెట్టే విధంగా టెండర్ ప్రక్రియ రూపొందించడం దుర్మార్గం అన్నారు. పాల్వంచ ప్రజల డబ్బును ఈ నియోజకవర్గంలోని ఒక నాయకుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత లాభాల కోసం వాడుకుంటున్నారనీ  మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు ప్రజల కోసం పని చేయాల్సింది పోయి, అధికారంలో ఉన్న వారి కనుసన్నల్లో పని చేయడం అత్యంత దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేసి, పట్టణంలోని ప్రాంతాల వారీగా విడివిడిగా టెండర్లు పిలవాలని పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.