17 July, 2026 | 2:55 AM

ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు

17-07-2026 02:37 AM

మంత్రి సీతక్క 

ములుగు, జులై 16 (విజయక్రాంతి): ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నుండి కొత్తగా పింఛన్లు ఇస్తామని, మహిళల ఆర్థిక అభివృద్ధికి, గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

మేడారం జాతరలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలెక్టర్ బోర్ఖడే  హేమంత్ సహదేవరావు తో కలిసి స్వామిని దర్శించుకుని, ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించి సమీక్ష నిర్వహించారు.

మల్లూరు దేవస్థానం ప్రత్యేకతను ప్రతిబింబించే విధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ విశిష్టతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు మంత్రి తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో రూపొందించిన విధంగా పనులను దశలవారీగా పూర్తి చేయాలన్నారు. ఎటునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ములుగు జిల్లా లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానానికి రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, మార్కెట్ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.