డిజిటలైజేషన్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి
కుమ్రం భీం అసిఫాబాద్,జూలై 16(విజయ క్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరగా పూర్తి అయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 100 శాతం పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 76 శాతం డిజిటలైజ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, పట్టణ ప్రాంతాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి పూరించిన ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ స్థాయి అధికారులకు అందే విధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని, కానీ ప్రక్రియ ముందే పూర్తి చేసే విధంగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.






