07-02-2026 06:51:23 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వరి దాబాను శనివారం మున్సిపల్, టూటౌన్ పోలీస్ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దాబాలో మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు ఇటీవల గుర్తించారు. బుధవారం రాత్రి టూటౌన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తుండగా, పలువురు మద్యం తాగుతూ పట్టుబడ్డారు.
దాంతో దాబా యజమాని పోదేన్ల దశరథంతోపాటు మద్యం తాగుతున్న ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దాబాలలో ఎవరైనా అక్రమంగా మద్యం వ్యాపారం చేసినా, సిట్టింగ్ ఏర్పాటు చేసినా లేదా బెల్ట్ షాపులు నిర్వహించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.