పంచాయితీలో పందికొక్కులు!
- చింతలపాలెం గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం
- సర్పంచులు లేని సమయంలో కొనసాగిన తంతు
- విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు
చింతలపాలెం, మే 18 : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే విషయాన్ని గ్రహించిన ప్రభుత్వాలు వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నాయి. ఆ నిధులను గ్రామపంచాయతీల అభివృద్ధికి ఉపయోగించాల్సిన కొందరు అధికారులు తమ స్వార్థంతో నిధులను దారి మళ్ళించడం ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది.
అయితే ప్రస్తుతం ఇదే పరిస్థితి చింతలపాలెం మండలంలో కొనసాగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. చింతలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ స్థానికంగా వార్తలు వస్తున్నాయి. దీంతో గ్రామపంచాయతీ నిధులను కొందరు స్వార్ధపరులు పందికొక్కుల బుక్కుతున్నట్టు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నట్లు వినికిడి.
ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కు అవకాశం?
చింతలపాలెం గ్రామ పంచాయతీ జెడ్.పి. హైస్కూల్కు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా ఇళ్లు కట్టుకున్న వారికి, కొందరు కార్యాలయ సిబ్బంది చేతివాటము ప్రదర్శించి పంచాయతీ రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి అవకాశం కల్పించారనే వార్తలు స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
నకిలీ రశీదులతో నిధుల మళ్లింపు..
గత రెండు సంవత్సరాలుగా ప్రజల దగ్గర ఇంటి పన్నులు వసూలు చేస్తూ.. నకిలీ బిల్ బుక్స్ సృష్టించి, నకిలీ రసీదులే ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో గ్రామ పంచాయతీకి రావాల్సిన ప్రభుత్వ నిధులను అక్రమంగా వారి సొంత జేబుల్లోకి మళ్లించుకున్నారనీ స్థానికుల మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అమాయక గ్రామ ప్రజల దగ్గర ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వ ధరల కంటే అదనంగా వేలకు వేలు లంచాలు వసూలు చేస్తూ, డబ్బులు ఇస్తేనే రికార్డుల్లో పేరు నమోదు చేస్తామని ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
సర్పంచ్ లేనప్పుడు కొనసాగిన తంతు
గతంలో రెండు సంవత్సరాలుగా సర్పంచ్ పదవి ఖాళీగా ఉండటాన్ని అదునుగా భావించి, పంచాయతీ నిధులను అడ్డగోలుగా పక్కదారి పట్టించారనే విమర్శలు స్థానికుల ద్వారా వినిపిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారాలపై గతంలోనే గ్రామస్తులు స్థానిక ఎం.పి.డి.ఓ కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టడంతో తెలివీగా సిబ్బందిలో ఒకరు నకిలీ బుక్ ను సృష్టించారని సంబత్8త అధికారి తాను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్థానికులే చెపుకుండుండడం గమనార్హం.
నలభై రోజులు దాటిన చర్యలు శూన్యం..
నిధుల దువినియోగంపై ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎంపిడిఓ హామీ ఇచ్చి 40 రోజులు గడిచినా, ఇప్పటివరకు సదరు అధికారీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ గ్రామస్తులు బాహాటంగానే చెబుతుండడం గమనించదగ్గ విషయం. అయితే ఇదే విషయంపై విసిగిపోయిన గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై జిల్లా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






