కరీంనగర్.. మరింత స్మార్ట్!
- యూసీఎఫ్ కింద మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
- 138 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- రూపురేఖలు మారనున్న కరీం’నగరం’
కరీంనగర్, మే 18 (విజయక్రాంతి) : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మహార్ధశ పట్టనుంది. స్మార్ట్ సిటీ పేరుతో ఇప్పటికే కరీంనగర్ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద మరో మూడు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మరో వైపు రాష్ట్ర ముక్షమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయి.
కేంద్రం యొక్క అర్బన్ ఛాలెంజ్ ఫండ్..
మొత్తం విలువ రూ.895 కోట్లు. అందులో భాగంగా పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. అట్లాగే వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు కేటాయించనుంది. అట్లాగే కరీంనగర్లో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ రూ.65 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు కేంద్ర అధికారుల బ్రుందం కరీంనగర్ లో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం అయ్యింది. యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన క్రుషి ఫలించింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలు మేయర్ పదవిని కాషాయ పార్టీకి అప్పగించడంతో ఇచ్చిన నిధులు తీసుకురావడంపైనే ద్రుష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవల 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద కార్పొరేషన్ కు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతోపాటు స్మార్ట్ సిటీ లో భాగంగా కార్పొరేషన్ కు రూ.70 కోట్లు వచ్చాయి.
కరీంనగర్ రూపురేఖలు మార్చాలంటే ఈ నిధులు సరిపోవని భావించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివ్రుద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు. తెలంగాణలో ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుందని పేర్కొంటూ అభివ్రుద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందులో భాగంగా యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఝప్తి చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు సీఎం గ్రీన్ సిగ్నల్..
కరీంనగర్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పురపాలక శాఖకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని రహదారులు నిర్మించాలని పేర్కొనడం చూస్తే కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి, జనాభా మరింత పెరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఆ దిశగా మరింత అభివృద్ధి చెందే అవకాశాల ఉన్నాయి.
కరీంనగర్ చుట్టూ.. 138 కిలోమీటర్లు..
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు చేశారు. నగరం చుట్టూ 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదన ఉంది. గన్నేరువరం మీదుగా జంగంపల్లి, గునుకుల కొండాపూర్ ఖాసీంపేట, మాదపూర్ మీదుగా పారువెల్ల, ఓద్యారం, బొమ్మకల్, దుర్శేడ్ ప్రాంతాల మీదుగా.. ఎలబోతారం, ఇరుకుల్ల, ఖాజీపూర్, నాగుల మల్యాల, నగునూర్ నుంచి కొత్తపల్లి(హెచ్), అన్నారం, మానకొండూర్, ముంజంపల్లి మీదుగా.. కొక్కరకుంట, వన్నారం, వెదిర, వెలిచా మన్నేపల్లి, పోరండ్ల, తిమ్మాపూర్ మీదుగా ఉంటుంది.మాస్టర్ ప్లాన్2041 అమలులోకివసై కరీంనగర్ రూపురేఖలు మారుతాయని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వికాయక్రాంతి కి తెలిపారు.






