07-02-2026 06:55:34 PM
సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ వెల్లడి!!
కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రశాంత్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమన్వయంతో పని చేయాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.
అలాగే ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, తమ విధులను నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు తాడ్వాయి శ్రీనివాస్, నర్సింగరావు పాల్గొని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు, చెక్ లిస్టులు, వివిధ ఫారాలు, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లోపాలు తలెత్తకుండా పాటించాల్సిన అంశాలను సవివరంగా వివరించి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ లు మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పూర్తి నిష్పక్షపాతత్వం, పారదర్శకతతో పాటు ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా పాటించడం అత్యంత అవసరమని సూచించారు.
అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి చిన్న తప్పిదానికి కూడా అవకాశం లేకుండా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో చట్టబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన కౌంటింగ్ సిబ్బందికి కల్పించబడిందని, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.