సింగరేణి బొగ్గు డిమాండ్ తగ్గడంతోనే నష్టాలు
శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్
మంచిర్యాల, మే 18 (విజయక్రాంతి) : కొత్త గనులు రాకపోవడం, ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం, నాణ్యత లోపాలతో సింగరేణి బొగ్గకు డిమాండ్ తగ్గి నష్టాలు వస్తున్నాయని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ సంస్థ అభ్యున్నతే లక్ష్యంగా ఉద్యోగులను చైతన్య పరిచేలా ప్రతీ యేటా సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్ మెంటల్ సమావేశాలు సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే 7 భూగర్భగనిలో, జీఎం కార్యాలయంల్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై జీఎం మాట్లాడారు.
టన్నుకు దాదాపుగా రూ. 700 తగ్గించడంతో ఏడాదికి రూ. 4 వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి, యంత్రాల వినియోగ సమయం పెంచుకుంటూ సంస్థ మనుగడకు కృషి చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల ఉపాధి కేంద్రాలైన భూగర్భగనుల జీవిత కాలం పెంపు ఎంతో ముఖ్యమన్నారు.
జీఎం కార్యాలయంలోని సపోర్టింగ్ డిపర్ట్ మెంట్లు ఎలాంటి తాత్సారం లేకుండా తమ విధులు నిర్వహిస్తూ భూగర్బ గనులు, ఉపరితల గనుల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు దోహదపడాలని సూచించారు. ఈ నెల 19న టీం 1 ఎస్‌ఆర్పీ 3 గనిలో, టీం 2 ఎస్సార్పీ 1 గనిలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు జరగనున్నాయని జీఎం వెల్లడించారు.
రెండు బృందాలుగా సమావేశాలు...
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే 7 గనిలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఉదయం షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, నైట్ డ్యూటీ ఉద్యోగులకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులకు టీం 1 సభ్యులు సంస్థ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు గని పరిస్థితులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం(ఐఈడీ) రాజన్న, ఏజీఎం(ఫైనాన్స్) సుమలత, హనుమాన్ గౌడ్, ఏఎస్‌ఓ విజయ్ కుమార్, డీజీఎం(పర్సనల్) ఎస్ అనిల్ కుమార్, కమిటీ కన్వీనర్ ఎస్ ఓ టూ జీఎం ఎన్ సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి సెక్రటరీ మోతుకూరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.






