ప్రజాపాలన -ప్రగతిప్రణాళికలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలి
అధికారులకు సూచించిన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు
మేడ్చల్, మే 18 (విజయ క్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు గుర్తించడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టామన్నారు.
గుర్తించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రేషన్ కార్డుల కోసం పెండింగ్ లో ఉన్న 16 వేల దరఖాస్తులను జూన్ రెండవ తేదీలోపు క్లియర్ చేసి కొత్త కార్డులు లబ్ధిదారులకు అందించాలన్నారు. జనసాంద్రతను బట్టి చౌక ధరల దుకాణాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా జనాభా ఉన్న ప్రాం తాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని మంత్రి సూచించారు.
విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాకు కొత్తగా 24 పాఠశాలలు మంజూరయ్యాయి అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేడ్చల్ జిల్లాలో ప్రారంభించనున్నామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల మెయింటినెన్స్ కు 12 కోట్లు మంజూరు చేసామని వివరించారు. ఎన్రోల్మెంటుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పాఠశాలల పున ప్రారంభంలోపు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
సమస్యల ఏకరువు
జిల్లా సమీక్ష సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల సమస్యలను వివరించారు. అంశాల వారీగా చర్చ జరిగిన సమయంలో తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు మూసి వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రత్యామ్నాయ రోడ్లకు సూచికలు ఏర్పాటు చేయనందున వాహనదారులకు ఎటు వెళ్లాలో తెలియడం లేదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కంకర మిషన్ల వల్ల వల్ల వచ్చే రాయల్టీ ని మేడ్చల్ నియోజకవర్గంలోనే ఖర్చు చేయాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తమ నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు.
మున్సిపాలిటీలకు నిధులు లేనందున అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని చైర్పర్సన్లు జామురవి, కంఠం శిరీష కృష్ణారెడ్డి, శ్రీదేవి పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ఆర్టిఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.






